Hollande
-
చాలా దారుణమైన హింసాత్మక ఘటన
-
మొఘల్ గార్డెన్స్‌లో రాష్ట్రపతి స్వాగత సత్కారం
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోమ్’(స్వాగత సత్కార కార్యక్రమం) ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొఘల్ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత జాతీయ గీతాలాపన, వీవీఐపీతో పరస్పరం శుభాకాంక్షల తర్వాత.. ప్రణబ్ నిర్దేశిత మార్గం గుండా వెళ్తూ ఇతర ఆహ్వానితులకూ శుభాకాంక్షలు తెలిపారు. భద్రతా ముప్పును దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రపతి, ప్రధాని.. ప్రజలను కలవడానికి ఈ నిర్దేశిత మార్గాలను ఏర్పాటుచేశారు. ఇంతకుముందు రాష్ట్రపతి తన భద్రతా సిబ్బందిని కొంత దూరంలో ఉంచి ప్రజలను స్వేచ్ఛగా కలిసేవారు. భద్రతా ఆంక్షల వల్ల హోలాండ్కు కూడా వీవీఐపీ ఎన్‌క్లోజర్‌లోనే రాష్ట్రపతి సరసన ఆసనం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ తదితరులతో పాటు.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఎల్.కె.అద్వానీ వంటి ఆ పార్టీ సీనియర్ నేతలు, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఆయన భార్య గుచరుశరణ్ కౌర్‌లు కూడా ఎన్‌క్లోజర్‌లోనే ఆసీనులయ్యారు. ఎయిర్ ఫోర్స్ మార్షల్ అర్జన్‌సింగ్ (96 సంవత్సరాలు) కోసం ఎన్‌క్లోజర్‌లో ప్రత్యేకంగా ఒక సీటును కేటాయించారు. హోలాండ్కు మోదీ సాదర వీడ్కోలు 3 రోజుల పర్యటన ముగించుకుని మంగళవారం తిరుగు ప్రయాణమైన హోలాండ్కు మోదీ సాదరంగా వీడ్కోలు పలికారు. ‘భారత్‌ను సందర్శించినందుకు, గణతంత్ర దినోత్సవాలకు హాజరైనందుకు అధ్యక్షుడు హోలాండ్కు కృతజ్ఞతలు. ఫ్రాన్స్‌తో భారత్ స్నేహం ప్రత్యేకమైనది. హోలాండ్ పర్యటనలో చర్చలు సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి’ అని ఆయన బయల్దేరి వెళ్లాక ట్విటర్లో పేర్కొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు ట్వీట్ తెలియజేశారు. రాజ్యాంగ నిర్మాతలకు, ప్రత్యేకించిఅంబేడ్కర్కు నివాళులర్పించారు. సోనియా, రాహుల్ కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఘనంగా గణతంత్రం
పటిష్ట భద్రత మధ్య ఢిల్లీలో వేడుకలు ♦ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ ♦ రాజ్‌పథ్ రోడ్డులో సైనిక పాటవం, సాంస్కృతిక శకటాలు.. న్యూఢిల్లీ: భారత సైనిక పాటవం.. సుసంపన్న సాంస్కృతిక వైవిధ్య వర్ణాలు.. వివిధ రంగాల్లో సాధించిన విజయాలను దేశ రాజధానిలోని మహత్తర రాజ్‌పథ్‌లో సగర్వంగా ప్రదర్శిస్తూ.. 67వ గణతంత్ర దినోత్సవం దిగ్విజయంగా సాగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయ్ హోలాండ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలకు.. మునుపెన్నడూ లేనంతగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నేల నుంచి నింగి వరకూ డేగ కన్ను పహారాతో దుర్భేద్యంగా మారిపోయింది. ఢిల్లీ చలిపులిని తోసిరాజని వేలాది జనం రాజ్‌పథ్‌కు ఇరువైపులా చేరి గణతంత్ర కవాతును వీక్షించారు. వర్ణశోభిత శకటాలు తమ ముందు నుంచి ప్రదర్శనగా వెళుతూ ఉంటే కరతాళ ధ్వనులు చేస్తూ కేరింతలు కొట్టారు. ఫ్రాన్స్ సైనిక పటాలం కూడా ఈ పరేడ్‌లో పాల్గొనటం ఈ ఏడాది విశేషం. ఒక విదేశీ సైనిక దళం భారత గణతంత్ర పరేడ్‌లో పాల్గొనటం ఇదే తొలిసారి. అంతకుముందు.. హోలాండ్ రాజ్‌పథ్‌కు చేరుకోగా ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికి త్రివిధదళాల అధిపతులను పరిచయం చేశారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలతో పాటు.. దేశంలో రాజకీయ, సైనిక ప్రముఖులు, దౌత్యవేత్తలు ఈ పరేడ్‌ను వీక్షించారు. పరేడ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు రక్షణమంత్రి మనోహర్ పరీకర్, త్రివిధ దళాల అధిపతులు ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత శాంతి కాలంలో అందించే అత్యున్నత శౌర్యపురస్కారమైన అశోకచక్ర పతకాన్ని లాన్స్ నాయక్ మోహన్‌నాథ్ గోస్వామికి(మరణానంతరం) రాష్ట్రపతి ప్రదానం చేశారు. భారత జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించాక.. జాతీయ గీతాలాపన, సంప్రదాయబద్ధమైన 21 తుపాకుల వందనం కొనసాగాయి. కళ్లకు కట్టిన సైనిక పాటవం... హోలాండ్.. ప్రణబ్, మోదీల సరసన ఆశీనులయ్యారు. బంతిపువ్వు రంగు తలపాగా ధరించి హాజరైన మోదీ.. గంటన్నర సాగిన ఈ వేడుకల్లో పలు సందర్భాల్లో కొన్ని అంశాలను హోలండ్‌కు వివరిస్తూ కనిపించారు. గతంలో రెండు గంటలకు పైగా సాగే వేడుకలను ఈ ఏడాది గంటన్నరకే కుదించారు. క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం గల టి-90 ‘భీష్మ’ యుద్ధ ట్యాంకు, పదాతిదళ యుద్ధ వాహనం బీఎంపీ-2 (శరత్), బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన సంచార స్వతంత్ర లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, స్మెర్చ్ లాంచర్ వాహనాలు భారత సైనిక పాటవ ప్రదర్శనలో ముఖ్యమైనవి. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (ఢిల్లీ) లెఫ్టినెంట్ జనరల్ రాజన్వ్రీంద్రన్ సారథ్యంలో సైనిక, పోలీస్ పటాలాలు సమన్వయంతో.. సైనిక వాద్యాలకు అనుగుణంగా కవాతు చేస్తుండగా భారత సైనిక బలగాల సుప్రీం కమాండర్ ప్రణబ్ప్రత్యేక వేదిక నుంచి సైనిక వందనం స్వీకరించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక శకటాలు... త్రివిధ దళాలతో పాటు.. బీఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ పటాలాలు.. సీఆర్పీఎఫ్కు చెందిన మహిళా పటాలం, ఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్ తదితర పారా మిలటరీ, సాయుధ బలగాలతో పాటు.. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ పటాలాలు కవాతులో పాల్గొన్నాయి. విభిన్న చారిత్రక, నిర్మాణకళానైపుణ్య, సాంస్కృతిక వారసత్వ సంపదలను ప్రతిబింబిస్తూ.. 17 రాష్ట్రాల నుంచి, ఆరు కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియా వంటి శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ‘మెగావాట్ టు గిగావాట్ - సూర్యున్ని తేజోవంతం చేద్దాం’ నినాదంతో ప్రదర్శించిన గ్రీన్ ఎనర్జీ శకటం ఆకట్టుకుంది. గంగానది పవిత్రతను తెలిపిన విద్యార్థుల ‘నిర్మల్ గంగ’ వర్ణన ఆకట్టుకుంది. పరేడ్ చివర్లో వాయుసేన ఫ్లై పాస్ట్ నిర్వహించింది. సాహస బాలలకు అపూర్వ అభినందనలు ఈ ఏడాది జాతీయ సాహస పురస్కారాల విజేతలైన 25 మంది బాలబాలికలు ప్రత్యేక జీప్‌లో రాగా రాజ్‌పథ్‌లో ప్రజల నుంచి అపూర్వ అభినందనలు లభించాయి. ఆదివారం ప్రధాని చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ఈ బాలల్లో తెలంగాణకు చెందిన శివంపేట్ రుచిత, సాయికృష్ణ అఖిల్ కిలాంబి ఉన్నారు. ఢిల్లీ స్కూళ్ల విద్యార్థుల బృందం ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు కను విందు చేశాయి. దుర్భేద్య భద్రతలో... గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కీలక ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశముందన్న సమాచారంతో.. సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీల్లో భూతలం నుంచి గగనతలం వరకూ భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఢిల్లీ పోలీస్, కేంద్ర భద్రతా బలగాల నుంచి దాదాపు 50వేల మంది సాయుధ బలగాలను మోహరించి అణువణువూ పహారా చేపట్టటంతో ఆ ప్రాంతం దుర్భేద్య కోటను తలపించింది. ఢిల్లీలో పది వ్యూహాత్మక ప్రాంతాల్లో లైట్ మెషీన్‌గన్స్ ధరించిన కమాండోలను.. మరో రెండు ప్రాంతాల్లో విమాన విధ్వంసక తుపాకులను మోహరించారు. 15,000 సీసీటీవీ కెమరాలు ఏర్పాటు చేశారు. ప్రణబ్, హోలాండ్, అన్సారీ, మోదీ సహా పలువురు వీవీఐపీలు కూర్చున్న ఎన్‌క్లోజర్‌కు పలు అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రెసిడెన్షియల్ గార్డ్స్, ఎస్పీజీ, ఎన్ఎస్జీ అధికారులు లోపలి రెండు అంచెల భద్రతలో ఉండగా.. వెలుపలి వలయంలో ఢిల్లీ పోలీసులు భద్రతగా నిలిచారు. రాజ్‌పథ్‌కు ఇరువైపులా గల 45 భవనాలతో పాటు.. పరేడ్ (కవాతు) సాగే రహదారికి ఇరువైపులా గల భవనాలన్నిటి మీదా స్నైపర్స్‌ను మోహరించారు. -
సోలార్ కోసం ఫ్రాన్స్ 300 మిలియన్ యూరోలు
గూర్గావ్: వచ్చే ఐదేళ్లలో భారత్‌లో సౌర విద్యుత్ అభివృద్ధికి 300 మిలియన్ల యూరోలను(రూ.22,01,08,85,116.39) కేటాయించనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. సోమవారం గుర్గావ్లో అంతర్జాతీయ సోలార్ కూటమి (ఐఎస్ఏ) హెడ్ క్వార్టర్స్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. 'ది ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ 300 మిలియన్ల యూరోలను సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం వచ్చే ఐదేళ్లలో ఆర్థిక సహాయంగా అందించనుంది. ఐఎస్ఏ హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తామని భారత్ గతంలో అబుదాబిలో జరిగిన సమావేశంలో చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ పని వెంటనే ఏమాత్రం ఆలస్యం కాకుండా ప్రారంభం కావాలి. అందుకు కావాల్సిన ఆర్థిక సహాయం తమ వంతుగా అందిస్తాం' అని హోలాండ్ తెలిపారు. ఐఎస్ఏ కార్యక్రమాన్ని గతంలోనే ప్రధాని మోదీ, హోలాండే నవంబర్ 30న పారిస్ వాతావరణ సదస్సు సందర్భంగా ప్రారంభించారు. ఇందులో దాదాపు 120 దేశాలు భాగస్వామ్యం కానున్నాయి. -
'మా పిల్లలను చంపిన ఉగ్రవాదులను విడిచేది లేదు'
న్యూఢిల్లీ: 'మీ దేశ రాజ్యాంగం పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది' అని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అన్నారు. సోమవారం ఫ్రాన్స్, భారత్ మధ్య మొత్తం 13 ఒప్పందాలపై సంతకాలు చేసిన నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా మాట్లాడారు. ఈ ఒప్పందంలోనే ఫ్రాన్స్ కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల అమ్మక ఒప్పందం కూడా ఉంది. భారత రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని చెప్పిన ఆయన ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ పాత్ర ఆహ్వానించదగినదని కొనియాడారు. చాలా కాలంగా ఫ్రాన్స్, భారత్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఇరుదేశాలకు ఇప్పటికే ఒక అవగాహన ఉందని చెప్పారు. భారత్ తమకు ఇస్తున్న మద్దతు ఎప్పటికీ మరువలేనిదని చెప్పారు. తమ పిల్లలను పొట్టన పెట్టుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను అంత తేలికగా విడిచిపెట్టబోమని, ఈ విషయంలో తాము దృఢనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే శక్తులను ఉమ్మడిగా ఎదుర్కొంటామని చెప్పారు. అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ హోలాండ్ భారత్ కు మంచి మిత్రుడని అన్నారు. ఫ్రాన్స్ తో సంబంధాలను తమ దేశం ఎప్పటికీ గౌరవిస్తుందని చెప్పారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ, హోలాండ్ కలిసి గూర్గావ్ కు ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. -
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన హోలాండ్
-
'మానవ వనరులే మన ప్రధాన బలం'
చండీగఢ్: చండీగఢ్‌లో జరుగుతున్న భారత్- ఫ్రాన్స్ వాణిజ్య సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. గ్లోబల్ వార్మింగ్‌తో పాటు టెర్రరిజం నేడు మానవాళికి పెద్ద సమస్యగా మారిందన్నారు. పారిస్ ఉగ్రదాడుల అనంతరం ఫ్రాన్స్ చూపిన ధైర్య సాహసాలు అభినందనీయం అన్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారితో భారత్, ఫ్రాన్స్‌లు ఉమ్మడిగా పోరాడుతాయని మోదీ స్పష్టం చేశారు. రక్షణ చాలా ముఖ్యమైన అంశమన్న మోదీ.. ఇప్పుడు అది కేవలం యుద్ధ క్షేత్రంలోనే కాకుండా సైబర్ భద్రత విషయంలో కూడా అవసరమన్నారు. పారిస్‌లో జరిగిన పర్యావరణ సదస్సు.. కాప్ 21 విషయాలను ప్రధాని తన ప్రసంగంలో గుర్తుచేశారు. పారిస్ సదస్సులో హోలండ్.. భారత్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చారని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో ఉన్నటువంటి నిపుణులైన మానవ వనరులే ప్రధాన బలంగా మోదీ అభివర్ణించారు. భారత్‌లో పనిచేస్తున్న 400 ఫ్రెంచ్ కంపెనీలు సంతృప్తిగా ఉన్నాయన్నారు. -
'ఆ సదస్సులో మోదీ పాత్ర వర్ణించలేనిది..'
చండీగఢ్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు చండీగఢ్‌కు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్కు భారత్-ఫ్రాన్స్ బిజినెస్ ఫోరం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా హోలాండ్ను ప్రధాని మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మూడురోజుల పాటు హోలాండ్ భారత్‌లో పర్యటించినున్న విషయం తెలిసిందే. చండీగఢ్‌లో నేడు(ఆదివారం) జరుగుతున్న భారత్-ఫ్రాన్స్ బిజినెస్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ గత ఏడాది హోలాండ్‌తో ఐదుసార్లు భేటీ అయ్యే అవకాశం లభించిందని అన్నారు. ప్రపంచం మొత్తానికి గొప్ప విశ్వాసాన్ని, ఆశాభావాన్ని అందించిగల దేశం భారత్ అని అన్నారు. భారత్ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, గొప్పశ్రామికశక్తిగల దేశమని, ప్రపంచ దేశాల వస్తువులకు భారత్ గొప్ప మార్కెట్ అని గుర్తు చేశారు. అనంతరం హోలాండ్ మాట్లాడుతూ గత ఏడాది జరిగిన కాప్ 21 సదస్సులో మోదీ పాత్ర వర్ణించలేనిదని, నిర్ణయాత్మకం అని కొనియాడారు. భారత్‌తో దౌత్య సంబంధాలు మరింత మెరుగుపడేలా వాణిజ్య కార్యకలాపాలన పెంచుతామని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో కూడా ముందడుగు వేస్తామని చెప్పారు. ఈ సదస్సు తర్వాత హోలాండే ప్రముఖ స్థలాలను సందర్శిస్తారు. అనంతరం ఢిల్లీకి బయలు దేరుతారు. రిపబ్లిక్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనటంతో పాటు మోదీతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. -
'అంతా ఓకే కానీ ఇప్పుడు కాదు'
న్యూఢిల్లీ: భారత్‌కు రాఫెల్ యుద్ధ విమానాలను విక్రయించే ఒప్పందం సరైన దారిలోనే ముందుకుపోతుందని, అయితే ఇది ఈ పర్యటనలోనే పూర్తయ్యే విషయం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు ఆదివారం భారత్ చేరుకున్న ఆయన పీటీఐతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరు దేశాల మధ్య రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం కీలకం కానుందని హోలండే తెలిపారు. రాఫెల్ యుధ్దవిమానాల కొనుగోలుకు రూ 60 వేల కోట్లతో భారత్.. ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్న విషయం తెలిసిందే. దీని ద్వారా 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి భారత్ పొందనుంది. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి సాంకేతికపరమైన కారణాల నేపథ్యంలో మరికొంత కాలం ఆగక తప్పదని హోలండే తెలిపారు. -
సిరియాలో వేలు పెడతారా.. అందుకే దాడి!
అసలు ఫ్రాన్స్ మీద ఉగ్రవాద దాడి ఎందుకు జరిగింది... దాడి చేసింది ఎవరు.. ఇలాంటి ప్రశ్నలు చాలానే తలెత్తాయి. ఇస్లామిక్ స్టేట్ వాళ్లే దాడి చేసి ఉంటారని భావించినా, తొలుత స్ఫష్టమైన ఆధారాలేవీ లభించలేదు. తర్వాత మాత్రం దాడి చేసింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. అయితే అసలు ఈ దాడికి కారణం ఏంటన్నది మాత్రం తర్వాత తెలిసింది. సిరియా విషయంలో జోక్యం చేసుకున్నందుకే ఈ దాడి చేశామని దాడిలో పాల్గొన్న ఓ ఉగ్రవాది చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ''ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్దే తప్పని అతడు స్పష్టంగా చెప్పాడు.. నేను ఆ విషయం విన్నాను. సిరియా విషయంలో హోలండ్ జోక్యం చేసుకుని ఉండకూడదన్నాడు. ఇరాక్ గురించి కూడా మాట్లాడాడు'' అని పియెర్ జనాస్జక్ అనే రేడియో ప్రెజెంటర్ తెలిపారు. ద బటాక్లాన్ అనే సంగీత వేదిక వద్ద ఈ ఉగ్రవాది మాట్లాడుతుండగా తాను విన్నానని అన్నారు. 'అల్లాహో అక్బర్' అంటూ మరికొందరు ఉగ్రవాదులు నినాదాలు కూడా చేశారన్నారు. -
పారిస్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
పారిస్ : మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్‌లో అడుగుపెట్టిన ఆయనకి అక్కడి అధికారులు సాదర స్వాగతం పలికారు. తన తొమ్మిది రోజుల విదేశీ యాత్రలో భాగంగా మోదీ తొలుత ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. నాలుగురోజుల పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతోపాటు అక్కడి వ్యాపార వర్గాలతో మోదీ భేటీ అవుతారు. పౌర అణు ఇంధనం, రక్షణ తదితర రంగాల్లో ఆ దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. ఈ పర్యటనలో మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని కొత్త పుంతలు తొక్కించాలని భావిస్తున్నారు. ఒబామా భారత పర్యటనలో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించినట్లే ఫ్రాన్స్‌లో 'నావ్ పే' చర్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మోదీ, హోలాండేలిద్దరూ కలసి పడవలో ప్రయాణిస్తూ సమాలోచనలు జరపనున్నారు. అక్కడి మొదటి ప్రపంచ యుద్ధ స్మారకాన్ని సందర్శించి, అప్పట్లో ఫ్రాన్స్ తరఫున పోరాడి అమరులైన పది వేల మంది భారత సైనికులకు నివాళులర్పించనున్నారు. యునెస్కో ప్రధాన కార్యాలయం, ఎయిర్‌బస్ కంపెనీ, ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీలనూ మోదీ సందర్శిస్తారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ జర్మనీ, ఆతర్వాత కెనడాలో పర్యటనకు వెళతారు.