
ఘనంగా గణతంత్రం
పటిష్ట భద్రత మధ్య ఢిల్లీలో వేడుకలు
♦ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్
♦ రాజ్‌పథ్ రోడ్డులో సైనిక పాటవం, సాంస్కృతిక శకటాలు..
న్యూఢిల్లీ: భారత సైనిక పాటవం.. సుసంపన్న సాంస్కృతిక వైవిధ్య వర్ణాలు.. వివిధ రంగాల్లో సాధించిన విజయాలను దేశ రాజధానిలోని మహత్తర రాజ్‌పథ్‌లో సగర్వంగా ప్రదర్శిస్తూ.. 67వ గణతంత్ర దినోత్సవం దిగ్విజయంగా సాగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయ్ హోలాండ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలకు.. మునుపెన్నడూ లేనంతగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నేల నుంచి నింగి వరకూ డేగ కన్ను పహారాతో దుర్భేద్యంగా మారిపోయింది. ఢిల్లీ చలిపులిని తోసిరాజని వేలాది జనం రాజ్‌పథ్‌కు ఇరువైపులా చేరి గణతంత్ర కవాతును వీక్షించారు. వర్ణశోభిత శకటాలు తమ ముందు నుంచి ప్రదర్శనగా వెళుతూ ఉంటే కరతాళ ధ్వనులు చేస్తూ కేరింతలు కొట్టారు.
ఫ్రాన్స్ సైనిక పటాలం కూడా ఈ పరేడ్‌లో పాల్గొనటం ఈ ఏడాది విశేషం. ఒక విదేశీ సైనిక దళం భారత గణతంత్ర పరేడ్‌లో పాల్గొనటం ఇదే తొలిసారి. అంతకుముందు.. హోలాండ్ రాజ్‌పథ్‌కు చేరుకోగా ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికి త్రివిధదళాల అధిపతులను పరిచయం చేశారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలతో పాటు.. దేశంలో రాజకీయ, సైనిక ప్రముఖులు, దౌత్యవేత్తలు ఈ పరేడ్‌ను వీక్షించారు. పరేడ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు రక్షణమంత్రి మనోహర్ పరీకర్, త్రివిధ దళాల అధిపతులు ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత శాంతి కాలంలో అందించే అత్యున్నత శౌర్యపురస్కారమైన అశోకచక్ర పతకాన్ని లాన్స్ నాయక్ మోహన్‌నాథ్ గోస్వామికి(మరణానంతరం) రాష్ట్రపతి ప్రదానం చేశారు. భారత జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించాక.. జాతీయ గీతాలాపన, సంప్రదాయబద్ధమైన 21 తుపాకుల వందనం కొనసాగాయి.
కళ్లకు కట్టిన సైనిక పాటవం...
హోలాండ్.. ప్రణబ్, మోదీల సరసన ఆశీనులయ్యారు. బంతిపువ్వు రంగు తలపాగా ధరించి హాజరైన మోదీ.. గంటన్నర సాగిన ఈ వేడుకల్లో పలు సందర్భాల్లో కొన్ని అంశాలను హోలండ్‌కు వివరిస్తూ కనిపించారు. గతంలో రెండు గంటలకు పైగా సాగే వేడుకలను ఈ ఏడాది గంటన్నరకే కుదించారు. క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం గల టి-90 ‘భీష్మ’ యుద్ధ ట్యాంకు, పదాతిదళ యుద్ధ వాహనం బీఎంపీ-2 (శరత్), బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన సంచార స్వతంత్ర లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, స్మెర్చ్ లాంచర్ వాహనాలు భారత సైనిక పాటవ ప్రదర్శనలో ముఖ్యమైనవి. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (ఢిల్లీ) లెఫ్టినెంట్ జనరల్ రాజన్వ్రీంద్రన్ సారథ్యంలో సైనిక, పోలీస్ పటాలాలు సమన్వయంతో.. సైనిక వాద్యాలకు అనుగుణంగా కవాతు చేస్తుండగా భారత సైనిక బలగాల సుప్రీం కమాండర్ ప్రణబ్‌ప్రత్యేక వేదిక నుంచి సైనిక వందనం స్వీకరించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక శకటాలు...
త్రివిధ దళాలతో పాటు.. బీఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్ పటాలాలు.. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మహిళా పటాలం, ఆర్‌పీఎఫ్, ఢిల్లీ పోలీస్ తదితర పారా మిలటరీ, సాయుధ బలగాలతో పాటు.. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ పటాలాలు కవాతులో పాల్గొన్నాయి. విభిన్న చారిత్రక, నిర్మాణకళానైపుణ్య, సాంస్కృతిక వారసత్వ సంపదలను ప్రతిబింబిస్తూ.. 17 రాష్ట్రాల నుంచి, ఆరు కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియా వంటి శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ‘మెగావాట్ టు గిగావాట్ - సూర్యున్ని తేజోవంతం చేద్దాం’ నినాదంతో ప్రదర్శించిన గ్రీన్ ఎనర్జీ శకటం ఆకట్టుకుంది. గంగానది పవిత్రతను తెలిపిన విద్యార్థుల ‘నిర్మల్ గంగ’ వర్ణన ఆకట్టుకుంది. పరేడ్ చివర్లో వాయుసేన ఫ్లై పాస్ట్ నిర్వహించింది.
సాహస బాలలకు అపూర్వ అభినందనలు
ఈ ఏడాది జాతీయ సాహస పురస్కారాల విజేతలైన 25 మంది బాలబాలికలు ప్రత్యేక జీప్‌లో రాగా రాజ్‌పథ్‌లో ప్రజల నుంచి అపూర్వ అభినందనలు లభించాయి. ఆదివారం ప్రధాని చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ఈ బాలల్లో తెలంగాణకు చెందిన శివంపేట్ రుచిత, సాయికృష్ణ అఖిల్ కిలాంబి ఉన్నారు. ఢిల్లీ స్కూళ్ల విద్యార్థుల బృందం ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు కను విందు చేశాయి.
దుర్భేద్య భద్రతలో...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కీలక ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశముందన్న సమాచారంతో.. సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీల్లో భూతలం నుంచి గగనతలం వరకూ భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఢిల్లీ పోలీస్, కేంద్ర భద్రతా బలగాల నుంచి దాదాపు 50వేల మంది సాయుధ బలగాలను మోహరించి అణువణువూ పహారా చేపట్టటంతో ఆ ప్రాంతం దుర్భేద్య కోటను తలపించింది. ఢిల్లీలో పది వ్యూహాత్మక ప్రాంతాల్లో లైట్ మెషీన్‌గన్స్ ధరించిన కమాండోలను.. మరో రెండు ప్రాంతాల్లో విమాన విధ్వంసక తుపాకులను మోహరించారు. 15,000 సీసీటీవీ కెమరాలు ఏర్పాటు చేశారు. ప్రణబ్, హోలాండ్, అన్సారీ, మోదీ సహా పలువురు వీవీఐపీలు కూర్చున్న ఎన్‌క్లోజర్‌కు పలు అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రెసిడెన్షియల్ గార్డ్స్, ఎస్‌పీజీ, ఎన్‌ఎస్‌జీ అధికారులు లోపలి రెండు అంచెల భద్రతలో ఉండగా.. వెలుపలి వలయంలో ఢిల్లీ పోలీసులు భద్రతగా నిలిచారు. రాజ్‌పథ్‌కు ఇరువైపులా గల 45 భవనాలతో పాటు.. పరేడ్ (కవాతు) సాగే రహదారికి ఇరువైపులా గల భవనాలన్నిటి మీదా స్నైపర్స్‌ను మోహరించారు.