
కొనసాగుతున్న 'ఐసిస్' వేట
- మరి కొంత మంది 'ఐసిస్' సానుభూతిపరులు
- నిఘాముమ్మరం చేసిన ఇంటెలిజెన్స్
- మరో ఐదుగురు సానుభూతిపరులున్నట్లు అనుమానం
- కౌంటర్ ఇంటెలిజెన్స్, క్విక్ రెస్పాన్స్ టీంలతో గాలింపు
హైదరాబాద్
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద చర్యలతో గడగడలాడిస్తున్న ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) సానుభూతి పరుల కోసం తెలంగాణ వ్యాప్తంగా ముమ్మర వేట కొనసాగుతోంది. హైదరాబాద్‌లో నాలుగు రోజుల క్రితం జునూద్-అల్-ఖలీఫా-ఏ హింద్ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రసానుభూతి పరులను జాతీయ దర్యాప్తు బృదం(ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పీటీ వారెంట్ మీద తీసుకెళ్లిన నలుగురు అబు అన్స్, మహ్మద్ నఫీస్‌ఖాన్, షరీఫ్ మొయినుద్దీన్, మహ్మద్ ఒబేదుల్లాఖాన్‌లను ఎన్‌ఐఏ అధికారుల విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
పట్టుబడ్డ నలుగురితో పాటు నగరంలో మరో ఇద్దరు సానుభూతి పరులున్నట్లు భావించిన ఎన్‌ఐఏ అంచనాలు తప్పయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా.. మరో ఐదుగురు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఇద్దరు సిరియా వెళ్లిపోయారనీ తేలింది. జునూద్ అధినేత మునబీర్ ముస్తాఖ్ ఆదేశాల మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాలని ప్రణాళిక రచించినట్లు అధికారులు గుర్తించారు.
గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పేలుళ్లు జరపడం కోసం పలు ప్రాంతాల్లో రెక్కీ సైతం నిర్వహించారు. ఎన్‌ఐఏ దాడుల నేపథ్యంలో వారి కుట్రలు భగ్నమైంది. అయితే తప్పించుకొని తిరుగుతున్న మిగతా వారిని అదుపులోకి తీసుకోవడం కోసం నిఘా బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అందుకోసం కేంద్ర నిఘా వర్గాల నుంచి రాష్ట్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు అనుమానిత ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచారు. ఉగ్రవాద సానుభూతి పరుల కదలికలను కనిపెట్టేందుకు కౌంటర్ ఇంటలిజెన్స్, క్విక్ రెస్పాన్స్ టీంలు 24 గంటల పాటు దృష్టిసారించాయి.
వెబ్‌సైట్లపై దృష్టిసారించిన పోలీసులు..
ఇటీవలి కాలంలో ఉగ్రవాద చర్యలన్నీ సోషల్‌మీడియా, పలు ఇంటర్‌నెట్ వెబ్‌సైట్ల ద్వారా విస్తృతమవుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అందుకు అనుగుణంగా పలు రాష్ట్రాల్లో ఐసిస్ సానుభూతిపరమైన వెబ్‌సైట్లను నియంత్రిస్తున్నారు. తాజాగా దేశంలో 94 ఇంటర్నెట్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసినట్లు మహారాష్ట్ర యాంటీ టైస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్) ప్రకటించింది. హైదరాబాద్‌లో కూడా సోషల్ మీడియా, వెబ్‌సైట్ సానుభూతి పరులు విస్తృతంగా బయటపడుతుండటంతో కౌంటర్ ఇంటలిజెన్స్, సైబర్ పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఇంకా ఏమైనా వెబ్‌సైట్లను బ్లాక్ లిస్టు ఉంచాలా? అనే అంశంపై దృష్టిసారించారు.