'మానవ వనరులే మన ప్రధాన బలం'
చండీగఢ్: చండీగఢ్లో జరుగుతున్న భారత్- ఫ్రాన్స్ వాణిజ్య సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. గ్లోబల్ వార్మింగ్తో పాటు టెర్రరిజం నేడు మానవాళికి పెద్ద సమస్యగా మారిందన్నారు. పారిస్ ఉగ్రదాడుల అనంతరం ఫ్రాన్స్ చూపిన ధైర్య సాహసాలు అభినందనీయం అన్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారితో భారత్, ఫ్రాన్స్లు ఉమ్మడిగా పోరాడుతాయని మోదీ స్పష్టం చేశారు.
రక్షణ చాలా ముఖ్యమైన అంశమన్న మోదీ.. ఇప్పుడు అది కేవలం యుద్ధ క్షేత్రంలోనే కాకుండా సైబర్ భద్రత విషయంలో కూడా అవసరమన్నారు. పారిస్లో జరిగిన పర్యావరణ సదస్సు.. కాప్ 21 విషయాలను ప్రధాని తన ప్రసంగంలో గుర్తుచేశారు. పారిస్ సదస్సులో హోలండ్.. భారత్కు చాలా ప్రాధాన్యత ఇచ్చారని మోదీ పేర్కొన్నారు. భారత్లో ఉన్నటువంటి నిపుణులైన మానవ వనరులే ప్రధాన బలంగా మోదీ అభివర్ణించారు. భారత్లో పనిచేస్తున్న 400 ఫ్రెంచ్ కంపెనీలు సంతృప్తిగా ఉన్నాయన్నారు.