'మా పిల్లలను చంపిన ఉగ్రవాదులను విడిచేది లేదు'
న్యూఢిల్లీ: 'మీ దేశ రాజ్యాంగం పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది' అని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అన్నారు. సోమవారం ఫ్రాన్స్, భారత్ మధ్య మొత్తం 13 ఒప్పందాలపై సంతకాలు చేసిన నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా మాట్లాడారు. ఈ ఒప్పందంలోనే ఫ్రాన్స్ కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల అమ్మక ఒప్పందం కూడా ఉంది. భారత రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని చెప్పిన ఆయన ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ పాత్ర ఆహ్వానించదగినదని కొనియాడారు.
చాలా కాలంగా ఫ్రాన్స్, భారత్ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఇరుదేశాలకు ఇప్పటికే ఒక అవగాహన ఉందని చెప్పారు. భారత్ తమకు ఇస్తున్న మద్దతు ఎప్పటికీ మరువలేనిదని చెప్పారు. తమ పిల్లలను పొట్టన పెట్టుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను అంత తేలికగా విడిచిపెట్టబోమని, ఈ విషయంలో తాము దృఢనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే శక్తులను ఉమ్మడిగా ఎదుర్కొంటామని చెప్పారు. అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ హోలాండ్ భారత్ కు మంచి మిత్రుడని అన్నారు. ఫ్రాన్స్ తో సంబంధాలను తమ దేశం ఎప్పటికీ గౌరవిస్తుందని చెప్పారు.
ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ, హోలాండ్ కలిసి గూర్గావ్ కు ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు.