'రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతా'
ప్రధాని నరేంద్ర మోదీ మానసపుత్రిక అయిన 'డిజిటల్ ఇండియా' కార్యక్రమంలో తాను రూ. 2,50,000 కోట్ల పెట్టుబడులు పెడతానని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ మాటిచ్చారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా భారీగా విజయం సాధించడం ఖాయమని, భారత యువత కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారని ఆయన అన్నారు.
యువత ఆకాంక్షలను అందిపుచ్చుకోడానికి డిజిటల్ ఇండియా ఎంతగానో ఉపయోగపడుతుందని అంబానీ చెప్పారు. డిజిటల్ ఇండియా పిల్లర్ల మీద తాము రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ఈ సందర్భంగా ప్రకటించారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ పరికరాలను చవక ధరలకు తయారుచేయడానికి చిన్న తయారీదారులను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తమ రీటైల్ సిస్టం ద్వారా వారికి తగిన అమ్మకాల ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు.