నిందితురాలు ప్రతిభ
చిన్నారి కళ్లు పొడిచి చంపిన సవతి తల్లి
Published Wed, Dec 2 2015 3:46 PM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM
ముంబై: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. మానసిక స్థితి సరిగ్గా లేని ఆరేళ్ల చిన్నారిని సవతి తల్లి దారుణంగా హింసించి, హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పదంగా మరణించిన పాప మృతదేహాన్ని గుర్తించిన పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఒళ్లంతా తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉన్న పాయల్ రాజేష్ సావంత్(6) మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి హత్యకు గురైన తీరు చూసి పోలీసులు సైతం నివ్వెర పోయారు. ఐరన్ రాడ్లతో కొట్టడం, బ్లేడుతో కోయడం, గుండుపిన్నులతో గుచ్చడం లాంటి చిత్ర హింసలతోపాటుగా, అతి దారుణంగా పాప రెండు కళ్లు పదునైన ఆయుధంతో ఛిద్రం చేసిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించిన పోలీసులు సవతి తల్లి ప్రతిభను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా చేయగా, వారం రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
కాగా ఆటోడ్రైవర్ గా జీవనం సాగిస్తున్న రాజేష్ మొదటి భార్య ...ఇద్దరు ఆడపిల్లలు పాయల్, మయూరిని భర్త వద్దే వదలిపెట్టి 2011లో వెళ్లిపోయింది. దీంతో రాజేష్ 2013లో ప్రతిభను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే మానసిక వికలాంగురాలైన పాయల్ ని నిత్యం వేధిస్తూ , చివరకు తీవ్రంగా కొట్టి, గొంతు నులిమి హత్య చేసింది. కాగా పోలీసుల విచారణలో ప్రతిభ నేరాన్ని అంగీకరించింది.
Advertisement
Advertisement