
ముంబై : దక్షిణ ముంబైలోని అత్యంత ఖరీదైన తార్ధే ప్రాంతంలో ఓ చిన్న గది దొరకడమే గగనం కాగా, నెలకు కేవలం రూ 64కే 800 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ అందుబాటులో ఉంది. చదరుపు అడుగు రూ 60,000 పలికే ఈ ప్రాంతంలో ఇంత తక్కువ అద్దెకే లభిస్తున్నా 11 ఏళ్లుగా ఈ ఫ్లాట్‌లో రెంట్‌కు దిగే వారే కరువయ్యారు. ఈ భవనాన్ని నిర్మించిన ఆర్‌డీ మహలక్ష్మీవాలా ఛారిటీ బిల్డింగ్ ట్రస్ట్ విధించిన ప్రత్యేక నిబంధనతో ఈ ఫ్లాట్ పదేళ్లకు పైగా ఖాళీగా పడిఉంది.
పార్శీ కమ్యూనిటీకి చెందిన ఈ ట్రస్ట్ సదరు ఫ్లాట్‌ను కేవలం పార్శి పోలీస్ అధికారికే కేటాయించాలని ముంబై పోలీసులతో 1940లో ఒప్పందం చేసుకోవడంతో ఈ చిక్కు వచ్చి పడింది. కాగా ప్రస్తుతం ముంబై పోలీస్ విభాగంలో ఇద్దరు పార్శి కమ్యూనిటీ పోలీస్ అధికారులున్నా వారిలో ఒకరు ముంబై వెలుపల పోస్టింగ్‌లో ఉండగా, మరో అధికారికి ఇప్పటికే ముంబైలో ఫ్లాట్ ఉంది.
ముంబై అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పార్శీలు ఒకప్పుడు స్ధానిక యంత్రాగంలో, పోలీస్ విభాగంలో పెద్దసంఖ్యలో పనిచేసేవారు. రానురాను పార్శీల జనాభా తగ్గుతూ వస్తోంది. దీంతో ఫ్లాట్‌ను కేవలం పార్శీ పోలీస్ అధికారికే అద్దెకు ఇవ్వాలన్న నిబంధనను తొలగించాలని ముంబై పోలీసులు ట్రస్టుతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఫ్లాట్ కోసం పెద్దసంఖ్యలో పార్శీయేతర పోలీసు అధికారులు దరఖాస్తు చేసుకున్నా ట్రస్ట్ నిబంధనతో వారికి ఫ్లాట్ అందుబాటులోకి రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment