సాక్షి ముంబై: నగరంతోపాటు శివారు ప్రాంతాలు నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే ముంబై, ఠాణేలో వివిధ సంప్రదాయాల్లో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. బెంగాలీలు దుర్గాదేవి విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు చేస్తుండగా.. గుజరాతీయులు ప్రత్యేక పూజల తోపాటు దాండియా ఆటలు ఆడుతూ వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు బతుకమ్మ పాటలతో మార్మోగుతున్నాయి. ఇలా ఎవరి సంప్రదాయానికి అనుగుణంగా వారు నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటుండడంతో ప్రతి పల్లె, పట్టణం, నగరంలో ఉత్సవశోభ కనిపిస్తోంది.
తెలుగువారి బతుకమ్మ...
దేశ, విదేశాల్లో ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు వేడుకలను వేదికలుగా చేసుకుంటున్నారు. దసరాకు ముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు వారు జరుపుకునే బతుకమ్మ పండుగ ఈ వేడుకల్లో ప్రత్యేకాకర్షణగా నిలుస్తోంది. రంగురంగుల పూలను పేర్చి, రూపొందించిన బతుకమ్మలను ఇంటిముందున్న వాకిట్లో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ మహిళలు తొమ్మిదిరోజులపాటు బతుకమ్మ ఆడతారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని భారీఎత్తున జరుపుకుంటారు.
బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. ముంబైతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే తెలుగు ప్రజలు తమ పరిసరాల్లో బతుకమ్మ పండుగలను జరుపుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో చివరి రోజు మాత్రమే బతుకమ్మలను ఆడుతున్నప్పటికీ వర్లీ, బాంద్రా, అంధేరి, గోరేగావ్, బోరివలి, భివండీ, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో తొమ్మిదిరోజుల పాటు బతుకమ్మను ఆడుతున్నారు.
కిటకిటలాడుతున్న దేవీమాత ఆలయాలు...
దసరా సందర్భంగా ముంబైతోపాటు రాష్ట్రంలోని మహాలక్ష్మి, మహాకాళి, దుర్గాదేవి, లక్ష్మీదేవి తదితర దేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకోసం ముందునుంచే ఆలయాయాలను విద్యుత్ దీపాలతోపాటు రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాచీనమైన ఆలయాలున్నాయి. వీటిలో శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. వీటిలో ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాభవానీ, కొల్హాపూర్‌లోని మహా లక్ష్మి, నాందేడ్ జిల్లా మావూర్‌లోని రేణుకా దేవీమాతా, నాసిక్ జిల్లాలోని సప్తశృంగి దేవీమాతా ఆలయాలున్నాయి.
ఇక ముంబైలోని మహాలక్ష్మి, ముంబ్రాదేవి, ఠాణే జిల్లాలోని వజ్రేశ్వరీ, విరార్‌లోని జీవ్‌దనీ మాతా, ముంబ్రాలోని కొండపై ఉన్న ముంబ్రా దేవి తదితర ఆలయాలు కూడా నవరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి. ఈ ఆలయాలన్నీ దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నవరాత్రులను పురస్కరించుకొని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. తొమ్మిదిరోజులపాటు భారీ ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా భద్రతతోపాటు తాగు నీరు, ఇతర సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు పూర్తిచేశారు.
నగరానికి ఉత్సవశోభ..!
Published Thu, Sep 25 2014 10:36 PM | Last Updated on Sat, Oct 20 2018 4:29 PM
Advertisement