
ముంబై : పీఎంసీ బ్యాంక్ కుంభకోణం మరొకరిని బలితీసుకుంది. సంక్షోభంలో కూరుకుపోయిన పీఎంసీ బ్యాంక్‌లో ఖాతాకలిగిన ముంబైకి చెందిన డాక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. బాధితురాలిని డాక్టర్ నివేదితా బిజ్లాని(39)గా గుర్తించారు. పీఎంసీ డిపాజిటర్ సంజయ్ గులాటీ ఆత్మహత్యకు పాల్పడిన రోజే ఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెడిసిన్‌లో పీజీ చేసిన బిజ్లాని సోమవారం సాయంత్రం సబర్బన్ వెర్సోవా ప్రాంతంలోని తన నివాసంలో అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాగా డాక్టర్ నివేదిత బిజ్లానికి పీఎంసీ బ్యాంక్‌లో కోటి రూపాయల డిపాజిట్లు ఉన్నాయని ఆమె తండ్రి తెలిపారు. మరోవైపు భర్త నుంచి విడిపోయిన నివేదిత కుంగుబాటుతో బాధపడుతున్నారని ఆమె మరణానికి పీఎంసీ సంక్షోభానికి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇక పీఎంసీ బ్యాంకుకు చెందిన మరో డిపాజిటర్ ఫతోమల్ పంజాబీ మంగళవారం మరణించారు. బ్యాంకు సంక్షోభంపై మధనపడుతూ తీవ్ర ఒత్తిడికి లోనై ఫతోమల్ ప్రాణాలు తీసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. 4355 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగుచూసిన పీఎంసీ బ్యాంక్‌కు సంబంధించి ఖాతాదారుల లావాదేవీలపైనా ఆర్‌బీఐ పలు నియంత్రణలు విధించడంతో డిపాజిటర్లు తమ సొమ్ము వెనక్కుతీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment