ముంబై : కరోనా మహమ్మారి విజృంభణతో వణుకుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇకపై బహిరంగ ప్రదేశాల్లో విధిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఏ కారణంతో బయటకు వచ్చినా విధిగా మాస్క్ ధరించాలని, ఇంట్లో తయారుచేసుకున్న మాస్క్‌ను సైతం అనుమతిస్తామని బీఎంసీ పేర్కొంది. మాస్క్ ధరించని వారిని అరెస్ట్ చేసేందుకు వెనుకాడమని అధికారులు పేర్కొన్నారు.
కాగా, ప్రజలు బయటకు వచ్చే సందర్భంలో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రజలకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కేసులు ముంబై సహా మహారాష్ట్రలో విపరీతంగా పెరుగుతుండటంతో మహమ్మారిపై పోరాటానికి చేతులు కలపాలని మాజీ రక్షణ, ఆరోగ్య సేవల సిబ్బందిని సీఎం ఉద్ధవ్ ఠాక్రే కోరారు. లాక్‌డౌన్‌తో ప్రజలకు అసౌకర్యం తప్పదని, అయితే అంతకుమించి మరో మార్గం లేదని వెబ్‌కాస్ట్ ద్వారా సీఎం ప్రజలకు స్పష్టం చేశారు. మరోవైపు మహమ్మారి విస్తరిస్తున్న క్రమంలో ముంబైలో లాక్‌డౌన్‌ను పొడిగించేందుకు అధికారులు యోచిస్తున్నారు. ముంబైలో ఇప్పటివరకూ 318 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 50 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment