మురికివాడలో పుట్టి.. సత్తా చాటి.. | Mumbai Twins Crack IIT-JEE, Bus Driver Father Doesn't Know What it is | Sakshi
Sakshi News home page

మురికివాడలో పుట్టి.. సత్తా చాటి..

Published Sat, Jun 21 2014 5:59 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

మురికివాడలో పుట్టి.. సత్తా చాటి..

మురికివాడలో పుట్టి.. సత్తా చాటి..

ముంబై కవలల ఘనత
 ముంబై: మురికివాడల్లో పుట్టినా చదువులో మేటి అనిపించుకున్నారు ఈ ముంబై కవలలు. బస్ డ్రైవర్ కుమారులు ఇద్దరూ ఒకేసారి ప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈలో ఉత్తీర్ణత సాధించారు. గురువారం ప్రకటించిన ఐఐటీ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ముంబైకి చెందిన బస్ డ్రైవర్ రామశంకర్ యాదవ్ కుమారులైన రామ్ ఓబీసీ కేటగిరీలో 267వ ర్యాంకు దక్కించుకోగా.. అతని కవల సోదరుడు శ్యామ్ అదే విభాగంలో 1,816వ ర్యాంకు సాధించాడు. ముంబైలోని భివండీ ప్రాంతంలోని ఓ మురికి వాడలో రామశంకర్ యాదవ్ కుటుంబం నివసిస్తోంది. తనకు వచ్చే రూ.8 వేల జీతంతోనే రామశంకర్ కుటుంబాన్ని పోషిస్తూ.. నలుగురు పిల్లలను చదివిస్తున్నాడు. అయితే రామ్, శ్యామ్ చదువులో చురుకైనవారు కావడంతో టెన్త్, 12వ తరగతి పరీక్షల్లో కోచింగ్ లేకుండానే మంచి మార్కులు సాధించారు.
 
 అయితే ఎఫ్‌ఐఐటీజేఈఈ పెట్టిన ఆప్టిట్యూడ్ పరీక్షలో పాస్ కావడంతో జేఈఈకి ఉచితంగా కోచింగ్ సంపాదించారు. అయితే, ఐఐటీ ప్రవేక్ష పరీక్ష పాస్ కావడంతో ఈ కుటుంబానికి కష్టాలు తీరిపోలేదు. ఇప్పుడు వీరిద్దరినీ ఐఐటీల్లో చేర్పించడం ఆ తండ్రికి తలకు మించిన భారంగా మారింది. ఐఐటీలో చేర్చాలంటే లక్షల్లో ఫీజులు చెల్లించాలి. అది కూడా ఇద్దరికీ ఒకేసారి కట్టాలి. తన కుమారులు కష్టపడి చదువుతారని, అయితే వారి భవిష్యత్తు ప్రణాళికలకు ఏ విధంగా సహాయపడాలో అర్థం కావడం లేదని, అన్ని త్వరలోనే సర్దుకుంటాయని రామశంకర్ ఆశాభావంతో ఉన్నాడు.
 
 అతి చిన్న వయసులోనే...!
 పాట్నా: బీహార్‌కు చెందిన శివానంద్ తివారీ 14 ఏళ్లకే ప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన విద్యార్థిగా రికార్డు సృష్టించాడు. గురువారం విడుదల చేసిన ఐఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తివారీ 2,587వ ర్యాంకు సాధించాడు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని మరీ శివానంద్ తివారీ తొలిసారి పరీక్షకు హాజరుకావడమే కాక ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. బీహార్‌లోని రోహ్తాస్ జిల్లా ధరమ్‌పుర శివానంద్ తివారీ స్వస్థలం.
 
  సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన తివారీ ఇప్పుడు ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించినా.. మొదటగా మత ప్రబోధకుడు కావాలనుకున్నాడు. 2011లో పాట్నా, ఢిల్లీలో బ్రాంచ్‌లున్న నారాయణ ఐఐటీ-పీఎంటీ అకాడమీ డెరైక్టర్ యూపీ సింగ్.. శివానంద్ తివారీ ప్రతిభను గుర్తించాడు. అతని తండ్రి కమల్‌కాంత్‌ను ఒప్పించి శివానంద్‌ను ఢిల్లీ తీసుకువెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇదే క్రమంలో స్కూల్ స్టడీస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన శివానంద్.. ఈ ఏడాది 93.4 శాతం మార్కులతో 12వ తరగతి పాస్ అయ్యాడు. దానితో పాటే ఐఐటీ శిక్షణ కూడా తీసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement