
పట్టపగలు నడిరోడ్డుపై యువకుని హత్య
తిరువనంతపురం: 'మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు' అన్న ఓ కవి ఆవేదనకు నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన. పట్టపగలు నడిరోడ్డుపై రెచ్చిపోయిన దుండగులు.. ఓ ముస్లిం యువకుడిని కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేరళలోని తిరువనంతపురంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటన పలువురిని విభ్రాంతికి లోను చేసింది. ఒక కేసులో ప్రత్యక్షసాక్షిగా ఉన్నాడన్న కారణంతో పగ, ప్రతీకారంతో రగిలిపోతూ మానవత్వాన్ని మరిచిన కొంతమంది యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. ...షబ్బీర్ (23) తన స్నేహితుడితో కలిసి బైక్పై వెడుతుండగా నలుగురు దుండగులు అడ్డుకున్నారు. కర్రలతో విచక్షణా రహితంగా దాడిచేశారు. పారిపోవడానికి ప్రయత్నించిన షబ్బీర్ ను పట్టుకొని మరీ రోడ్డుపై పడవేసి విపరీతంగా కొట్టారు. స్నేహితుడిపైనా దాడి చేసి అనంతరం దుండగులు అక్కడినుంచి పారిపోయారు. షబ్బీర్ను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనను మొత్తాన్ని గుర్తు తెలియని వక్తులు సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే గత ఏడాది జరిగిన y నేరానికి సంబంధించి షబ్బీర్ ప్రత్యక్ష సాక్షి అని సమాచారం. సదరు నలుగురు వ్యక్తులకు ఈ నేరంతో సంబంధం ఉండటంతో ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. అటు సంఘటన జరిగి 48 గంటలు గడిచినా ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.