సాక్షి, న్యూఢిల్లీ : ‘గంగా నదికి ప్రాణి హోదా కల్పిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎవరైనా ఆ నదిలో మునిగిపోయి మరణిస్తే నదిపై క్రిమినల్ కేసులు దాఖలు చేస్తారా? అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పడం ఒట్టి జిమ్మిక్కు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్లీ మందిరం నిర్మాణ అంశాన్ని ముందుకు తీసుకొస్తారు. ఈ హామీ కూడా పాకిస్తాన్‌కు ముల్లాలను పంపిస్తామని చెప్పడం లాంటిదే. హజ్ యాత్ర కోసం ముస్లింలకు ఎయిర్ ఇండియాలో ఇస్తున్న సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం నిలిపి వేస్తుందా?’ ఈ మూడు ప్రశ్నల్లో.... ఓ మనిషిని 42 రోజుల పాటు జైల్లో పెట్టేంత నేరం దాగిందా?
ఫేస్‌బుక్‌లో ఈ మూడు ప్రశ్నలను షేర్ చేసినందుకు ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌బాద్‌కు చెందిన జకీర్ అలీ త్యాగిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం తెల్సిందే. వాస్తవానికి త్యాగి కూడా తనంతట తాను ఈ ప్రశ్నలు వేయలేదు. ఇతరులు వేసిన ప్రశ్నలను షేర్ చేసినందుకే అయన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు. ఏప్రిల్ రెండవ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు 42 రోజుల జైలు శిక్ష అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసును ఆయన హైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు.
అసలు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే....‘నేను ముజాఫర్‌నగర్‌లో మా సమీప బంధువు వారిస్ ఖాన్‌తో ఉంటున్నాను. ఏప్రిల్ 2వ తేదీన ఏదోపనిమీద బయటకు వెళ్లిన వాడిని రాత్రి 8.45 గంటలకు ఇంటికొచ్చాను. అప్పటికే ఇంట్లో ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఖాన్ విజ్ఞప్తిపై వారికి మంచినీళ్లు ఇచ్చాను. వారున్న గది నుంచి మరో గదిలోకి వెళుతుండగా ఓ పోలీసు వచ్చి నా చేతిని పట్టుకున్నారు. ఫేసుబుక్ పోస్టింగ్‌లకు సంబంధించి విచారించాలి, పోలీసు స్టేషన్‌కు రమ్మని పిలిచారు. విషయం ఏమిటన్ ఖాన్ ప్రశ్నించగా, చిన్న విషయమే గంటలో వదిలేస్తామని చెప్పారు. నన్ను కొత్వాలి నగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌నే విమర్శించేంత వాడివారా? అంటూ సివిల్ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి పోలీసు స్టేషన్ సెల్లో నన్ను చితక్కొట్టారు. ఆయనెవరో ఇప్పటికీ నాకు తెలియదు. ఎవరిని అడిగినా ఆయనెవరో చెప్పలేదు. పోలీసులు కూడా ఆదిత్యనాథ్‌ను విమర్శించినందుకే ఉన్నతాధికారులు ఆదేశం మేరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అయితే నేను ఏం విమర్శించానో అడగలేదు, చెప్పలేదు. ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం నేను షేర్ చేసిన మూడు ప్రశ్నలను మాత్రమే పొందుపర్చారు. ఆ మరుసటి రోజున కోర్టుకు తీసుకెళ్లారు. జడ్జీ రాలేదన్న కారణంగా జైలుకు పంపించారు. వారం రోజుల తర్వాత మళ్లీ కోర్టులో హాజరుపర్చారు.
ఎలాంటి విచారణ జరుగకుండానే కేసు వాయిదా పడడంతో మళ్లీ జైలుకు పంపించారు. 42 రోజుల తర్వాత మే 13వ తేదీన బెయిల్ మంజూరైంది. ఇంటికి తిరిగి వెళ్లాను. నేను షేర్ చేసిన ప్రశ్నల్లో తప్పేముందో, నాపై కేసు ఎందుకు పెట్టారో, ఎందుకు జైలుకు పంపించారో! నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు’ అని త్యాగి ఢిల్లీలోని ‘ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియాలో’ తన గోడును జర్నలిస్టులకు వినిపించారు. దేశంలోని దళితులు, మైనారిటీల పక్షాన న్యాయం కోసం పోరాడే ‘భీమ్ ఆర్మీ డిఫెన్స్ కమిటీ’ త్యాగిని యూపీ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ కమిటీ త్యాగి కేసును టేకప్ చేసింది. కాలిన్ గాన్‌సాల్వ్స్ లాంటి ప్రముఖ న్యాయవాదులు ఈ కమిటీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment