
‘సోనియాతో ఎప్పుడో మాట్లాడా.. మీ ఊహ ఉత్తిదే’
పాట్నా: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన విందుకు తాను గైర్హాజరవడంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ తరుపున జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ హాజరయ్యారని అందుకే తాను వెళ్లలేదని చెప్పారు. కానీ, ఈ విషయాన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకొని ప్రచారం చేసిందని అన్నారు. మీడియా చెప్పిన అంశంలో వాస్తవం లేదని, అవన్నీ ఊహాగానాలేనని తేల్చేశారు. ‘నేను ఇప్పటికే ఏప్రిల్‌లో సోనియాగారిని కలిశాను. ఇప్పుడు ఏం అంశంమీద చర్చిస్తున్నారో అదే అంశంపై అప్పుడే చర్చించాను. ఇప్పుడు మాత్రం ఆమె అన్ని విపక్ష పార్టీలను ఆహ్వానించారు.
జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్ జేడీయూ తరుపున వెళ్లారు కూడా. అంతేగానీ, నేను విందుకు హాజరవకపోవడంలో ప్రత్యేక ఉద్దేశం లేదు. మారిషస్ ప్రధాని ప్రవీంద్ జగ్‌నౌత్ కు ప్రధాని మోదీ ఇస్తున్న గౌరవ విందులో పాల్గొంటున్నాను. అయితే, నేను మోదీతో భేటీ అయ్యేది బిహార్ అభివృద్ధిపైనే.. అందులో భాగంగానే అక్కడ జరిగే విందులో పాల్గొంటాను’ అని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిత్వంపై జరుగుతున్న కసరత్తులో భాగంగా సోనియా గాంధీ ఏర్పాటుచేసిన విందుకు నితీశ్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శనివారం సమావేశం కానున్నారు. బీహార్ అభివృద్ధికి సంబంధించి ఆయన ప్రధానితో చర్చించనున్నారు.