
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అరెస్ట్‌తో జాతీయస్థాయిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లండన్ నుంచి చెన్నైకు చేరుకున్న సందర్భంగా విమానాశ్రయంలోనే మనీలాండరింగ్ కేసులో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. గురువారం (మార్చి 1న) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు కార్తీ హాజరుకావాల్సి ఉండగా ఒకోరోజు ముందే ఈ అరెస్ట్ జరిగింది. గతంలోనే ఈడీతో పాటు సీబీఐ పలుమార్లు కార్తీని విచారించాయి. కార్తీ విదేశీ ప్రయాణాలు చేయకుండా గతంలో ‘లుకౌట్’ నోటీసులు సైతం జారీఅయ్యాయి. గత నవంబర్‌లో తన కుమార్తెను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేర్పించేందుకు కార్తీకి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
తాజాగా బయటపడిన వివిధ అవినీతి, కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరలించడంతో పాటు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మోదీ ప్రభుత్వం ఈ చర్యకు దిగిందని కాంగ్రెస్‌పార్టీ ఆరోపించింది. గత పదిరోజుల్లోనే రూ.30 వేల కోట్ల విలువకు పైబడిన కుంభకోణాలు బయటపడినా కేంద్రం నోరు మెదపలేదని పేర్కొంది. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిన వారు విదేశాలకు చెక్కేసిన పట్టించుకోని ప్రభుత్వం, సీబీఐ విచారణకు సహకరిస్తున్న కార్తీని దేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ నేత అశోక్ గెహ్లాట్ విమర్శించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదనే విషయాన్ని కార్తీ అరెస్ట్‌స్పష్టం చేస్తోందని బీజేపీ పేర్కొంది. ఏ రాజకీయపార్టీ అయినా దీనిని కక్షసాధింపుగా ఎలా భావిస్తోందో అర్థం కావడం లేదని,చట్టం తన పని తాను చేసుకుపోతోందని బీజేపీ నాయకుడు సంబిత్ పాత్రా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే కార్తీ అవినీతి, అక్రమాలకు పక్కా ఆధారాలున్నాయని సీబీఐ స్పష్టంచేసింది.
2007 నాటి కేసు...
2007లో విదేశాల నుంచి రూ. 305 కోట్ల మేర ఐఎన్‌ఎక్స్ మీడియాకు నిధులు అందేలా ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ) క్లియరెన్స్ ఇవ్వడంలో అక్రమాలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. కేంద్ర ఆర్థికమంత్రిగా కార్తీ తండ్రి చిదంబరం ఉండడం వల్ల ఇది సాధ్యమైందని, దీని ద్వారా కార్తీకి రూ. 10 లక్షలు నిధుల రూపంలో అందాయని పేర్కొంది. దీనిపై 2015 మే నెలలో సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. అదే ఏడాది డిసెంబర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ చైన్నైలోని కార్తీ కార్యాలయాలపై దాడులు జరిపాయి. 2016 ఏప్రిల్‌లో కార్తీకి సంబంధమున్న బెంగళూరులోని వాసన్ హెల్త్‌కేర్ గ్రూప్‌లో ఈడీ సోదాలు చేసింది. అదే ఏడాది జులైలో ఎయిర్‌సెల్–మాక్సిస్ ముడుపుల కేసులో కార్తీకి ఈడీ సమన్లు జారీచేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ కేసు విషయంలోనే చిదంబరం, కార్తీ నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. తమ విచారణకు కార్తీ సహకరించని కారణంగా అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఇప్పుడు సీబీఐ తెలిపింది. ఈ కేసులో విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన స్పష్టంగా ఉండడంతో పాటు, దీనికి సంబంధించిన ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేసి విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని స్పష్టంచేసింది.
ఇవీ సీబీఐ ఆరోపణలు...
ఐఎన్‌ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పూర్వ యజమానులు పీటర్, ఇంద్రాణి ముఖర్జీ. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పెట్టుబడులు వచ్చిన కేసులో 2007లో కార్తీ ద్వారా ఈ కేసును ఈ సంస్థ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంది. ఎఫ్‌ఐపీబీ రూ.4.62 కోట్ల విదేశీ పెట్టుబడులకు అనుమతించగా, ఈ సంస్థ రూ.305 కోట్ల పెట్టుబడులు తెచ్చుకుంది. తన తండ్రి చిదంబరం ఆర్థికమంత్రి కావడంతో ఎఫ్‌ఐపీబీ అధికారులపై కార్తీ ఒత్తిడి తెచ్చి ఈ కేసును విచారించకుండా చూశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థ రూ.305 కోట్లకు ఎఫ్‌ఐపీబీకి తాజా దరఖాస్తు చేసుకునేలా చేశారు. ఈ సంస్థలోకి అప్పటికే పెట్టుబడులు రాగా ఆ తర్వాత ఎఫ్‌ఐపీబీ అనుమతిచ్చేలా చేశారు. మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సర్వీస్ కింద ఐఎన్‌ఎక్స్ సంస్థ నుంచి కార్తీ పరోక్ష నియంత్రణలోని అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ (ప్రై) లిమిటెyŠ ద్వారా రూ. 10 లక్షలు అందాయి. కార్తీ గుర్తింపు బయటపడకుండా ఉండేందుకే ఈ విధంగాచేశారు. చిదంబరానికి ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక ప్రయోజనాలున్న కంపెనీలకు రూ.3.5 కోట్ల మేర లబ్ది చేకూరేందుకు ఐఎన్‌ఎక్స్ గ్రూపు ద్వారా లావాదేవీలు నడిచాయి.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment