యంగ్ మోడల్ ఎంత దారుణం చేసింది?
బెంగళూరు: మోడల్ అయి ఉండి ఓ యువతి మతిస్థిమితం లేని అమ్మాయిలా దుశ్చర్యకు పాల్పడింది. తన తాతాబామ్మలు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో వారిని ఇంట్లో వేసి తాళం వేసి అనంతరం నిప్పుపెట్టి తగులబెట్టింది. ఈ క్రమంలో ఆ వృద్ధ దంపతులు స్వల్పంగా గాయపడ్డారు. సర్వం కోల్పోయారు. ఈ చర్యకు దిగిన ఆ యువతి అనంతరం పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమెకోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మైసూర్‌లో ప్రియా(22) అనే ఓ యువతి తన తాతాబామ్మలతో కలిసి ఉంటోంది. తల్లిదండ్రులు లేరు. ఆమె తల్లి బతికుండగానే తండ్రి మరో వివాహం చేసుకున్నాడు.
ఆ తర్వాత కొద్ది రోజులకే తల్లి చనిపోవడంతో ప్రస్తుతం తాతయ్యవాళ్లతో ఉంటోంది. ఆమెకు సిగరెట్లు తాగడం, మద్యం సేవించడంవంటి దుర్వ్యసనాలు కూడా అలవాటైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు మోడలింగ్‌కు వెళుతున్న ప్రియా తనకు కొంత డబ్బు కావాలని అడుగగా వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని ఇంట్లో పడేసి తలుపులేసి నిప్పంటించి పారిపోయింది. వారి అరుపులు విని చుట్టుపక్కలవారు వచ్చి ప్రాణాలతో రక్షించారు. అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలు ఆర్పేశాయి. కాగా, తమ మనుమరాలిపై కేసు పెట్టేందుకు నిరాకరించారు. ఆమె తిరిగి తమ ఇంటికి రావాలని కోరుకుంటున్నారు.