సాక్షి, హైదరాబాద్: ‘తాత ముత్తాతలు, అమ్మమ్మ నానమ్మలు.. తమ మనవళ్లు, మనవరాళ్లను కలవకుండా ఉండలేరు. పిల్లలంటే తల్లిదండ్రులకే కాదు.. నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలకు కూడా ప్రేమ, అభిమానం, వాత్సల్యం ఉంటుంది. పిల్లల ఎదుగుదలలో తాతముత్తాతల పాత్ర కూడా ముఖ్యమైనదే. పిల్లల సంరక్షణ అంటే ఒక్క డబ్బుతో ముడిపడిందే కాదు.. పలు దృక్కోణాల్లో చూడాలి. తండ్రి/తల్లి బిడ్డను జాగ్రత్తగా చూసుకోగలిగినంత మాత్రాన అది పూర్తిగా పరిగణించబడదు.
జీవితంలో దగ్గరి వ్యక్తుల, తమకు ఇష్టమైన వారి జీవన విధానాన్ని అనుసరిస్తూ చిన్నారులు వ్యక్తిగా ఎదుగుతారు. ప్రతి బిడ్డ సంతోషకరమైన బాల్యానికి అర్హులు. తాత–తల్లిదండ్రుల ఉనికి నుంచి మనుమలు పొందే ప్రేమ, ఆప్యాయత, భద్రత నిస్సందేహంగా ముఖ్యమైనవి. వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి’అని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
మొదటి భార్య(ఓ చిన్నారి తల్లి) మరణించడంతో నల్లగొండకు చెందిన ఓ వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు. ఆ చిన్నారి ప్రస్తుతం తండ్రి వద్దే ఉంటోంది. చిన్నారిని తన సంరక్షణకు ఇవ్వాలంటూ నల్లగొండకు చెందిన 56 ఏళ్ల మహిళ(చిన్నారి అమ్మమ్మ) జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. కేసు విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, మనవరాలిని చూసేందుకు తనకు అనుమతి ఇవ్వడం లేదని, ఇచ్చేలా ఆమె తండ్రిని ఆదేశించాలని కోరుతూ ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ సివిల్ రివిజన్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున కె.సీతారాం, ప్రతివాది తరఫున పి.విజయ్‌కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి అనుబంధాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో అత్త, అల్లుడి వివాదాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవడంలేదు.వారి వివాదాలు పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపకూడదు.
అమ్మమ్మ తాతయ్యల పట్ల ద్వేషంతో పెంచితే పాప కచ్చితంగా మంచి మనిషిగా పరిణామం చెందదు. ఇది జీవితకాల ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అనడంలో సందేహం లేదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అమ్మమ్మ తన మనవరాలిని వారానికి ఒకసారి కలవడానికి అనుమతి ఇస్తున్నాం’అని ఆదేశించింది.
చదవండి: Mukarram Jha: నిజాం రాజు ముకరం జాకు సీఎం కేసీఆర్ నివాళులు..
Comments
Please login to add a commentAdd a comment