ఢిల్లీ: వోహ్రా కమిటీ నివేదికను పార్లమెంట్లో ఉంచాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా, వోహ్రా కమిటీ నివేదికను పార్లమెంట్లో ఉంచాలని అభిప్రాయపడుతున్నానని తెలిపారు. వోహ్ర కమిటీ తన నివేదికలో రాజకీయ నాయకులకు, మాఫియా లీడర్లకు గల సంబంధాలను ప్రస్తావించింది. మాఫియా డాన్ ఛోటా రాజన్ అరెస్టుతో ప్రజల దృష్టి వోహ్రా రిపోర్టుపై పడిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హౌం శాఖ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన నివేదికలోని అంశాలను ప్రజలముందుంచాల్సిన అవసరముందన్నారు.
ఛోటా రాజన్ అరెస్టుతో ప్రజలు దావూద్ ఇబ్రహీం ను వెనక్కి రప్పించడం గురించి డిమాండ్ చేస్తున్నారనీ ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ గవర్నర్ వోహ్రా నేతృత్వంలో 1990 లలో వేసిన కమిటీ నేరపూరితమైన రాజకీయాలపై నివేధిక ఇచ్చింది. దీనిలో రాజకీయ నాయకులకు, నేరగాళ్లకు గల సంబంధాలపై పలు ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించారు.