బొమ్మనహళ్లి : బెంగళూరు నగరంలో ఉన్న నమ్మ మెట్రో రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన నేమ్ బోర్డులపై హిందీ భాషను తొలగించాలని, లేదంటే తామే వచ్చి హిందీలో ఉన్న బోర్డులను తొలగిస్తామని కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నారాయణగౌడ మెట్రో అధికారులను హెచ్చరించారు. నగరంలోని శాంతినగరలో ఉన్న బీఎంఆర్‌సీఎల్ కార్యాలయం ముందు కర్నాటక రక్షణ వేదిక (కరవే) ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ధర్నాలో నారాయణగౌడ మాట్లాడారు. నగరంలో కేంద్ర ప్రభుత్వానికి అతి ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేది రవాణా శాఖతోపాటు నమ్మ మెట్రో కూడ ఒకటన్నారు.
అయితే మెట్రోలో మొదట కన్నడ, అనంతరం ఆంగ్ల భాషను మాత్రం వినియోగించాలని, ఎక్కడా హిందీ భాషను వినియోగించరాదని అన్నారు. ఎంజీ రోడ్డు నుంచి బయ్యప్పనహళ్లి మార్గంలో, నాగసంద్ర నుంచి సంపిగే మార్గంలో ఉన్న మెట్రో స్టేషన్‌లలో కన్నడ, ఆంగ్ల భాషల్లో మాత్రమే నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారని, కానీ స్టేషన్‌ల లోపలి భాగాల్లో చాలా చోట‍్ల నేమ్ బోర్డులను హిందీలో ఏర్పాటు చేశారని, వాటిని వెంటనే తొలగించాలని కోరారు. బీఎంఆర్‌సీ అధికారులు కావాలని హిందీ భాషను వాడుతున్నారన్నారు.
2013 మెట్రో నియమాల ప్రకారం ఎక్కడా హిందీ భాషను వాడాల్సిన అవసరం లేదని, అయినా కర్నాటకలో బీఎంఆర్‌సీఎల్ అధికారులు హిందీ వినియోగిస్తున్నారని ఆయన అన్నారు. హిందీలో ఏర్పాటు చేసిన నేమ్ బోర్డులను మీరే తొలగిస్తే బాగుంటుందని, లేదంటే వారం తరువాత వచ్చి తమ కరవే కార్యకర్తలు తొలగిస్తారని హెచ్చరించారు. అనంతరం బెంగళూరు మెట్రో రైల్ ఎండీ ప్రదీప్‌సింగ్ ఖరోను కలిసి నారాయణ గౌడ వినతి పత్రం అందజేశారు.
మెట్రోలో హిందీ బోర్డులు తొలగించాలి
Published Fri, Jun 23 2017 9:05 PM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM
Advertisement