నోట్లరద్దు కఠిన నిర్ణయం
► ప్రజల మద్దతుతోనే విజయవంతం
► మూడేళ్ల పాలన సంబరాల్లో ప్రధాని మోదీ
► ఈశాన్య భారతంతోనే ‘సూపర్ పవర్’
► నదిపై నిర్మించిన అతిపొడవైన వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని
► ఆర్థిక విప్లవానికి బీజం పడిందన్న మోదీ
గువాహటి/సదియా: కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం కఠినమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయినా ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి అండగా నిలిచారన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జరగుతున్న దేశవ్యాప్త సంబరాలను గువాహటిలో శుక్రవారం మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. నోట్లరద్దు నిర్ణయం సాహసోపేతమని తెలిపారు. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయానికి మద్దతు తెలిపిన 125 కోట్ల మంది భారతీయులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘నోట్లరద్దు కఠినమైన నిర్ణయం. కానీ ప్రజలను రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. కానీ ప్రజలు అన్ని సమస్యలు ఎదుర్కొని అండగా నిలిచారు. ప్రజలు మార్పును గమనిస్తున్నారు’ అని మోదీ తెలిపారు.
నల్లధనంపై తమ ప్రభుత్వ నిర్ణయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని.. అవినీతి పరులనుంచి తీసుకున్న డబ్బును ప్రజలకే పంచుతామన్నారు. ‘నాకు సమస్యలు ఎదురవుతాయని తెలుసు. కానీ, ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించను’ అని ప్రధాని స్పష్టం చేశారు. తను నిజాయితీగా తీసుకున్న నిర్ణయాలకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నానన్నారు. ఓబీసీ కమిషన్ ఏర్పాటు, గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం వంటి పలు ప్రభుత్వ పథకాలను మోదీ ప్రస్తావించారు.
ఈశాన్యం.. ఆగ్నేయాసియా వ్యాపార కేంద్రం
నవభారత నిర్మాణంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలను ఆగ్నేయాసియా దేశాల వ్యాపార కేంద్రంగా మార్చనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దీని ద్వారా భారత్‌ను సూపర్ పవర్ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. శుక్రవారం అస్సాంలో సదియా ప్రాంతంలో లోహిత్ నది (బ్రహ్మపుత్ర ఉపనది)పై నిర్మించిన దేశంలోనే నదిపై అతిపొడవైన వంతెన (9.15 కిలోమీటర్లు)ను శుక్రవారం ప్రధాని జాతికి అంకితం చేశారు.
ఇందుకోసం ఈ ప్రాంతంలో మౌలికవసతుల కల్పనతోపాటుగా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్, రోడ్లు, రైలు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో దేశంలోని ఈ రాష్ట్రాల్లోని ప్రతి మూలనుంచి దేశమంతా అనుసంధానమయ్యేలా చేస్తామన్నారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లను కలిపే సదియా వంతెన ద్వారా ప్రయాణ దూరం, డబ్బులు ఆదా కావటంతోపాటుగా కొత్త ఆర్థిక విప్లవానికి బీజం పడిందన్నారు. ఈ వంతెనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత–గాయకుడు భూపేన్ హజారికా పేరు పెట్టారు.
మౌలికవసతులతోనే అభివృద్ధి
భౌతిక, సామాజిక మౌలిక వసతుల కల్పన వల్లే శాశ్వత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో సేంద్రియ పద్ధతుల్లో నాణ్యమైన అల్లాన్ని పండిస్తున్న రైతులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఈ వంతెన చాలా ఉపయోగపడుతుందన్నారు. అవసరాన్ని బట్టి మిలటరీ, ఆయుధాలను సరిహద్దుల్లోకి వీలైనంత త్వరగా తరలించేందుకు ఈ వంతెన చాలా ఉపయోగపడుతుంది. యుద్ధ ట్యాంకులను తరలించే సామర్థ్యం ఈ వంతెనకుంది. అస్సాంలోని కామరూప్ జిల్లాలో నిర్మించతలపెట్టిన ఏయిమ్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.
‘సంపద’ను ప్రారంభించిన మోదీ
నవభారత నిర్మాణంలో ఈశాన్య రాష్ట్రాలను సరికొత్త ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రధాని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ‘సంపద’ (స్కీమ్ ఫర్ ఆగ్రో–మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆగ్రో–ప్రాసెసింగ్) పథకాన్ని అస్సాం శుక్రవారం ఆయన ప్రారంభించారు. అస్సాంలోని ధేమాజీ జిల్లాలో భారత వ్యవసాయ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘రూ.6వేల కోట్ల సంపద పథకం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధి జరుగుతుంది. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి’ అని వెల్లడించారు.
ఎన్‌ఈ అంటే!
‘ఈశాన్యరాష్ట్రాలు (నార్త్–ఈస్ట్) నవభారతానికి కొత్త ఇంజన్ లాంటివి. ఎన్‌ఈ అంటే న్యూ ఎకానమీ, న్యూ ఎనర్జీ, న్యూ ఎంపవర్‌మెంట్’ అని మోదీ అన్నారు. పంచమార్గాల (హైవే, రైల్వే, జలమార్గం, వాయుమార్గం, ఐ (సమాచార)వే) ద్వారా ఈ మార్పు తీసుకొస్తామన్నారు. సేంద్రియ వ్యవసాయానికి ఈశాన్యరాష్ట్రాల్లో చాలా అవకాశం ఉందన్నారు.
ఇప్పటికే సిక్కిం పూర్తిగా సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తోందని.. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయన్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తామన్నారు. పంట బీమా, పంటలకు నీటి సరఫరా కోసం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన చాలా కీలకమైన పరిణామాలని మోదీ తెలిపారు. రైతులు పొలాల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు.