cancellation of banknotes
-
నోట్లరద్దుపై మాటల యుద్ధం
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నోట్లరద్దు, జీఎస్టీలు అనైతిక నిర్ణయాలని, ఇవి పన్ను ఉగ్రవాదానికి బీజం వేశాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ దీటుగా స్పందించారు. కేంద్రం నిర్ణయంతో చాలా ప్రయోజనం జరిగిందని.. మన్మోహన్ సింగ్ హయాంలోనే దేశంలో లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఘాటుగా ప్రతివిమర్శలు చేయటంతో రాజకీయ యుద్ధం మొదలైంది. కాగా, నోట్లరద్దుకు నేటితో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విపక్షాలన్నీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. అటు బీజేపీ కూడా.. నోట్లరద్దు లాభాలను ప్రజలు వివరిస్తూ ‘అవినీతి వ్యతిరేక దినం’ జరిపేందుకు సిద్ధమైంది. నోట్లరద్దు, జీఎస్టీలతో విధ్వంసం దేశ ఆర్థిక వ్యవస్థకు నోట్లరద్దు, జీఎస్టీ భారీ నష్టాన్ని కలిగించాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. నోట్లరద్దును ‘చరిత్రాత్మక తప్పిదం’ అని తాను పేర్కొన్నప్పటికీ.. బీజేపీ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం తీరును మన్మోహన్ తూర్పారబట్టారు. నోట్లరద్దు, జీఎస్టీతోపాటుగా బుల్లెట్ రైలు, ఇతర ప్రభుత్వ నిర్ణయాలపైనా ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.‘నోట్లరద్దు.. వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధంగా కొల్లగొట్టడం’ అని మన్మోహన్ పునరుద్ఘాటించారు. జీఎస్టీ మోదీ తొందరపాటు నిర్ణయానికి ఉదాహరణ అని విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మన్మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా ఇబ్బందిపడ్డ చిన్న, మధ్యతరగతి వ్యాపారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ‘నోట్లరద్దుతో పన్ను ఎగవేత, నల్లధనం వెలికితీత సాధ్యం కాదు. రాజకీయ స్వలాభం కోసమే నోట్లరద్దు తీసుకొచ్చారని స్పష్టమైంది. అక్రమార్కులంతా తప్పించుకున్నారు. ఉద్యోగాలు పోయాయి. యువకులకు అవకాశాలు సన్నగిల్లాయి. వ్యాపారాలు అసంతృప్తికర స్థితిలో ఉన్నాయి. అంతేకాదు, ఈ నిర్ణయం వల్ల చైనా లాభపడగా దేశీయ వ్యాపార రంగం కుదేలైంది’ అని మన్మోహన్ విమర్శించారు. దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటుందని చెప్పినా.. గుణపాఠం నేర్చుకునేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ‘పేదలు, అణగారిన వర్గాలు, రైతులు, చిరు, మధ్యతరగతి వ్యాపారులు.. ఇలా కొన్ని వర్గాలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని పార్లమెంటులో చెప్పాను. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని మన్మోహన్ వెల్లడించారు. నోట్లరద్దు, జీఎస్టీ వ్యాపార సమాజంలో పన్ను ఉగ్రవాదానికి బీజం వేశాయని మన్మోహన్ విమర్శించారు. విదేశీ పెట్టుబడులు గత 25 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయన్నారు. నోట్లరద్దు పెద్ద స్కాం: మమత మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ‘నోట్లరద్దు ఓ పెద్ద స్కాం. కొందరు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని ఆమె పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో నిష్పాక్షిక విచారణ జరిపిస్తే అన్ని విషయాలూ బయటకొస్తాయన్నారు. కాగా, నోట్లరద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు బుధవారం దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని నిర్ణయించాయి. వీటికి పోటీగా.. అవినీతి వ్యతిరేక దినంగా జరపాలని బీజేపీ నిర్ణయించింది. మన్మోహన్ నేతృత్వంలోనే దోపిడీ: జైట్లీ నోట్లరద్దుపై మన్మోహన్ చేసిన విమర్శలు, ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఖండించారు. నోట్లరద్దు, జీఎస్టీ పూర్తి నైతిక కార్యక్రమాలని చెప్పుకొచ్చిన జైట్లీ.. దేశంలో 2జీ, సీడబ్ల్యూజీ, బొగ్గు కేటాయింపులు మొదలైన కుంభకోణాల ద్వారా ప్రజల సొమ్ము లూటీ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోనే జరిగిందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను క్రమపద్ధతిలోకి తీసుకురావటం, పన్ను పరిధి విస్తృతి, స్వచ్ఛమైన ఆర్థిక వ్యవస్థకు నోట్లరద్దు దోహదపడిందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో జైట్లీ మాట్లాడారు. భారత ప్రతిష్టను నోట్లరద్దు, జీఎస్టీ మసకబార్చాయన్న మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘2014కు ముందు, 2014 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను విశ్లేషించుకోండి’ అని మాజీ ప్రధానికి సూచించారు. ‘సరైన విధానాల్లేక ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టింది మీరే. ఇప్పుడు పరిస్థితి మారింది. సంస్కరణల ఫలితాలు కనబడుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి’ అని జైట్లీ పేర్కొన్నారు. ‘నల్లధన వ్యతిరేక ఉద్యమం నైతికంగా వాస్తవమైంది.. అందువల్ల రాజకీయంగా సరైనదే. 2జీ, కామన్వెల్త్ గేమ్స్, బొగ్గు కేటాయింపులు ఇలా వివిధ కుంభకోణాలతో దేశాన్ని లూటీ చేసిందెవరు?’ అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ‘నోట్లరద్దు అన్నింటికి పరిష్కారం కాదు. వ్యవస్థలో మార్పులు తీసుకురావటంలో అత్యంత కీలకంగా మారింది’ అని జైట్లీ వెల్లడించారు. -
నోట్ల రద్దు నష్టం రెండు లక్షల కోట్లు!
‘చారాణా కోడికి బారణా మసాలా’ అనే సామెత పెద్ద నోట్ల రద్దుకు సరిగ్గా సరిపోతుంది. నోట్ల రద్దుతో లక్షల కోట్ల నల్ల ధనం ఖజానాకి చేరుతుందని ప్రభుత్వం చెప్పినా... వాస్తవానికి సర్కారుకే ఖర్చు తడిసి మోపెడయ్యింది. – సాక్షి, అమరావతి ఆర్బీఐ గణాంకాల ప్రకారం రద్దు చేసేనాటికి చెలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు. దాన్లో రూ.15.28 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. దీంతో రూ.16,000 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు మిగిలినట్లు లెక్క. కానీ తొలుత ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేస్తే 13 నుంచి 14 లక్షల కోట్లు మాత్రమే వెనక్కొస్తాయని, కనీసం రెండు లక్షల కోట్లు మిగులుతాయని అంచనా వేసింది. వ్యయం రూ. 30,000 కోట్లపైనే..: పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను ప్రవేశపెట్టడం ఆర్బీఐకి తలకు మించిన భారమయింది. రద్దయిన పాత నోట్లను స్వీకరించి, వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టడం, రవాణా, కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలను రీ కాలిబ్రేషన్ చేయడం కోసం సుమారు రూ.30,000 కోట్లు ఖర్చయినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ముద్రణా వ్యయం రెట్టింపయి రూ.7,965 కోట్లకు చేరింది. ఖర్చు పెరిగింది కనక ప్రభుత్వానికిచ్చే డివిడెండ్‌లో ఆర్బీఐ రూ.35,221 కోట్లు కోతపెట్టింది. ఇవికాక నోట్ల రద్దు, డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10,000 కోట్లపైనే ఖర్చు చేశాయి. జీడీపీ నష్టం రూ.1.3 లక్షల కోట్లు: నోట్ల రద్దుతో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణనీయంగా పడిపోయింది. వేల మంది ఉపాధి కోల్పోయారు. నోట్ల రద్దు తర్వాత జీడీపీ 13 త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశీయ స్థూల జాతీయోత్పత్తి రూ.130 లక్షల కోట్లుగా ఉంది. వృద్ధిరేటు ఒక శాతం తగ్గడం ద్వారా రూ. 1.30 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇవన్నీ చూస్తే నోట్ల రద్దుతో రూ.2 లక్షల కోట్ల పైనే నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. -
బ్యాంకులకు తగినంత సమయం ఇవ్వాల్సింది
ముంబై: పెద్ద నోట్ల రద్దు విషయంలో బ్యాంకులు సన్నద్ధమయ్యేందుకు వాటికి మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని ఎస్బీఐ మాజీ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఇటీవలే ఎస్బీఐ చైర్పర్సన్ పదవి నుంచి విరమణ తీసుకున్న ఆమె గురువారం ముంబైలో ‘ఇండియాటుడే’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. నల్లధనాన్ని, నకిలీ నోట్లను ఏరిపారేస్తామంటూ గతేడాది నవంబర్ 8న రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచి చెడుల గురించి అరుంధతి మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయం బ్యాంకులపై భారీ పని భారానికి దారి తీసిన నేపథ్యంలో దీనిపై అరుంధతి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ‘‘దేనికైనా మనం ఎక్కువగా సన్నద్ధమై ఉంటే దాని తాలూకూ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. నిజానికి అక్కడ మరింత సన్నద్ధమై ఉంటే (పెద్ద నోట్ల రద్దు) మాపై శ్రమ అంత ఉండేది కాదు. నగదును కదిలించాలంటే అందుకు నిబంధనలు ఉన్నాయి. మాకు పోలీసులు అవసరం. కాన్వాయ్‌ను సమకూర్చాలి. మార్గనిర్దేశం చేయాలి. ఇది భారీ రవాణా సన్నాహకం’’ అని అరుంధతీ భట్టాచార్య అన్నారు. నోట్ల రద్దు సరైన చర్యా, కాదా అన్నది తేల్చడానికి మరింత సమయం అవసరమన్నారు. డీమోనిటైజేషన్ వల్ల ప్రయోజనాలు ఏంటన్న దానిపై 40 శాతం పన్ను చెల్లింపుదారులు పెరిగారని, డిజిటల్ లావాదేవీలు పుంజుకున్నాయని చెప్పారు. -
‘జీరో’ ఖాతాల్లో భారీ డిపాజిట్లు
న్యూఢిల్లీ: నల్లధన చలామణికి వీలు కల్పించాయని భావిస్తున్న షెల్ కంపెనీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కీలక సమాచారం అందింది. 5.800 షెల్ కంపెనీల జీరో బ్యాలన్స్ ఖాతాల్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా రూ.4,574 కోట్ల వరకూ నగదు జమయిందని, ఆ తరవాత అందులో రూ.4.552 కోట్ల మేర విత్‌డ్రా చేసుకోవడం కూడా జరిగిపోయిందని సమాచారం అందింది. 2,09,032 అనుమానిత కంపెనీలకు సంబంధించి లావాదేవీలు, పెద్ద నోట్ల రద్దు తర్వాత వాటి ఖాతాల్లో నగదు జమలపై 13 బ్యాంకులు కీలకమైన సమాచారాన్ని అందించాయని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపింది. ఈ కంపెనీలన్నీ కూడా ఈ ఏడాది ఆరంభంలో కంపెనీల రిజిస్ట్రార్ గుర్తింపును కోల్పోయినవే. ఈ తరహా కంపెనీల బ్యాంకు లావాదేవీలపై గత నెలలో కేంద్రం ఆంక్షలు కూడా విధించింది. కాగా, బ్యాంకులు అందించిన సమాచారం ప్రకారం... ఓ కంపెనీ అయితే ఏకంగా 2,134 ఖాతాలను కలిగి ఉండడం గమనార్హం. కొన్ని కంపెనీలకు 900 ఖాతాలు, కొన్నిటికి 300 ఖాతాలు కూడా ఉన్నాయి. గతేడాది పెద్ద నోట్ల రద్దు నాటికి (2016 నవంబర్ 8) ఈ కంపెనీల ఖాతాల్లో (రుణ ఖాతాల మినహా) రూ.22.05 కోట్ల బ్యాలన్స్ ఉంది. నవంబర్ 9న డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత నుంచి ఈ కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే నాటికి వీటి ఖాతాల్లో రూ.4,573.87 కోట్ల మేర నగదు డిపాజిట్లు అయింది. ఇందులో రూ.4,552 కోట్లను విత్ డ్రా చేసుకున్నారు’’ అని కేంద్రం తన ప్రకటనలో వివరించింది. -
నోట్లరద్దు కఠిన నిర్ణయం
► ప్రజల మద్దతుతోనే విజయవంతం ► మూడేళ్ల పాలన సంబరాల్లో ప్రధాని మోదీ ► ఈశాన్య భారతంతోనే ‘సూపర్ పవర్’ ► నదిపై నిర్మించిన అతిపొడవైన వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని ► ఆర్థిక విప్లవానికి బీజం పడిందన్న మోదీ గువాహటి/సదియా: కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం కఠినమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయినా ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి అండగా నిలిచారన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జరగుతున్న దేశవ్యాప్త సంబరాలను గువాహటిలో శుక్రవారం మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. నోట్లరద్దు నిర్ణయం సాహసోపేతమని తెలిపారు. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయానికి మద్దతు తెలిపిన 125 కోట్ల మంది భారతీయులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘నోట్లరద్దు కఠినమైన నిర్ణయం. కానీ ప్రజలను రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. కానీ ప్రజలు అన్ని సమస్యలు ఎదుర్కొని అండగా నిలిచారు. ప్రజలు మార్పును గమనిస్తున్నారు’ అని మోదీ తెలిపారు. నల్లధనంపై తమ ప్రభుత్వ నిర్ణయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని.. అవినీతి పరులనుంచి తీసుకున్న డబ్బును ప్రజలకే పంచుతామన్నారు. ‘నాకు సమస్యలు ఎదురవుతాయని తెలుసు. కానీ, ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించను’ అని ప్రధాని స్పష్టం చేశారు. తను నిజాయితీగా తీసుకున్న నిర్ణయాలకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నానన్నారు. ఓబీసీ కమిషన్ ఏర్పాటు, గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం వంటి పలు ప్రభుత్వ పథకాలను మోదీ ప్రస్తావించారు. ఈశాన్యం.. ఆగ్నేయాసియా వ్యాపార కేంద్రం నవభారత నిర్మాణంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలను ఆగ్నేయాసియా దేశాల వ్యాపార కేంద్రంగా మార్చనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దీని ద్వారా భారత్‌ను సూపర్ పవర్ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. శుక్రవారం అస్సాంలో సదియా ప్రాంతంలో లోహిత్ నది (బ్రహ్మపుత్ర ఉపనది)పై నిర్మించిన దేశంలోనే నదిపై అతిపొడవైన వంతెన (9.15 కిలోమీటర్లు)ను శుక్రవారం ప్రధాని జాతికి అంకితం చేశారు. ఇందుకోసం ఈ ప్రాంతంలో మౌలికవసతుల కల్పనతోపాటుగా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్, రోడ్లు, రైలు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో దేశంలోని ఈ రాష్ట్రాల్లోని ప్రతి మూలనుంచి దేశమంతా అనుసంధానమయ్యేలా చేస్తామన్నారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లను కలిపే సదియా వంతెన ద్వారా ప్రయాణ దూరం, డబ్బులు ఆదా కావటంతోపాటుగా కొత్త ఆర్థిక విప్లవానికి బీజం పడిందన్నారు. ఈ వంతెనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత–గాయకుడు భూపేన్ హజారికా పేరు పెట్టారు. మౌలికవసతులతోనే అభివృద్ధి భౌతిక, సామాజిక మౌలిక వసతుల కల్పన వల్లే శాశ్వత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో సేంద్రియ పద్ధతుల్లో నాణ్యమైన అల్లాన్ని పండిస్తున్న రైతులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఈ వంతెన చాలా ఉపయోగపడుతుందన్నారు. అవసరాన్ని బట్టి మిలటరీ, ఆయుధాలను సరిహద్దుల్లోకి వీలైనంత త్వరగా తరలించేందుకు ఈ వంతెన చాలా ఉపయోగపడుతుంది. యుద్ధ ట్యాంకులను తరలించే సామర్థ్యం ఈ వంతెనకుంది. అస్సాంలోని కామరూప్ జిల్లాలో నిర్మించతలపెట్టిన ఏయిమ్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ‘సంపద’ను ప్రారంభించిన మోదీ నవభారత నిర్మాణంలో ఈశాన్య రాష్ట్రాలను సరికొత్త ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రధాని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ‘సంపద’ (స్కీమ్ ఫర్ ఆగ్రో–మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆగ్రో–ప్రాసెసింగ్) పథకాన్ని అస్సాం శుక్రవారం ఆయన ప్రారంభించారు. అస్సాంలోని ధేమాజీ జిల్లాలో భారత వ్యవసాయ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘రూ.6వేల కోట్ల సంపద పథకం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధి జరుగుతుంది. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి’ అని వెల్లడించారు. ఎన్ఈ అంటే! ‘ఈశాన్యరాష్ట్రాలు (నార్త్–ఈస్ట్) నవభారతానికి కొత్త ఇంజన్ లాంటివి. ఎన్ఈ అంటే న్యూ ఎకానమీ, న్యూ ఎనర్జీ, న్యూ ఎంపవర్మెంట్’ అని మోదీ అన్నారు. పంచమార్గాల (హైవే, రైల్వే, జలమార్గం, వాయుమార్గం, ఐ (సమాచార)వే) ద్వారా ఈ మార్పు తీసుకొస్తామన్నారు. సేంద్రియ వ్యవసాయానికి ఈశాన్యరాష్ట్రాల్లో చాలా అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సిక్కిం పూర్తిగా సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తోందని.. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయన్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తామన్నారు. పంట బీమా, పంటలకు నీటి సరఫరా కోసం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన చాలా కీలకమైన పరిణామాలని మోదీ తెలిపారు. రైతులు పొలాల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు.