‘చారాణా కోడికి బారణా మసాలా’ అనే సామెత పెద్ద నోట్ల రద్దుకు సరిగ్గా సరిపోతుంది. నోట్ల రద్దుతో లక్షల కోట్ల నల్ల ధనం ఖజానాకి చేరుతుందని ప్రభుత్వం చెప్పినా... వాస్తవానికి సర్కారుకే ఖర్చు తడిసి మోపెడయ్యింది. – సాక్షి, అమరావతి
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం రద్దు చేసేనాటికి చెలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు. దాన్లో రూ.15.28 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. దీంతో రూ.16,000 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు మిగిలినట్లు లెక్క. కానీ తొలుత ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేస్తే 13 నుంచి 14 లక్షల కోట్లు మాత్రమే వెనక్కొస్తాయని, కనీసం రెండు లక్షల కోట్లు మిగులుతాయని అంచనా వేసింది.
వ్యయం రూ. 30,000 కోట్లపైనే..: పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను ప్రవేశపెట్టడం ఆర్‌బీఐకి తలకు మించిన భారమయింది. రద్దయిన పాత నోట్లను స్వీకరించి, వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టడం, రవాణా, కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలను రీ కాలిబ్రేషన్ చేయడం కోసం సుమారు రూ.30,000 కోట్లు ఖర్చయినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ముద్రణా వ్యయం రెట్టింపయి రూ.7,965 కోట్లకు చేరింది. ఖర్చు పెరిగింది కనక ప్రభుత్వానికిచ్చే డివిడెండ్‌లో ఆర్‌బీఐ రూ.35,221 కోట్లు కోతపెట్టింది. ఇవికాక నోట్ల రద్దు, డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10,000 కోట్లపైనే ఖర్చు చేశాయి.
జీడీపీ నష్టం రూ.1.3 లక్షల కోట్లు: నోట్ల రద్దుతో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణనీయంగా పడిపోయింది. వేల మంది ఉపాధి కోల్పోయారు. నోట్ల రద్దు తర్వాత జీడీపీ 13 త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశీయ స్థూల జాతీయోత్పత్తి రూ.130 లక్షల కోట్లుగా ఉంది. వృద్ధిరేటు ఒక శాతం తగ్గడం ద్వారా రూ. 1.30 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇవన్నీ చూస్తే నోట్ల రద్దుతో రూ.2 లక్షల కోట్ల పైనే నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment