![మహిళ లేకుంటే మనుగడలేదు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/61415390461_625x300.jpg.webp?itok=1jcFHdfB)
మహిళ లేకుంటే మనుగడలేదు
వారణాసి: ఆడ శిశు, భ్రూణ హత్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచంలో స్త్రీలు లేకపోతే మానవ మనుగడే ఉండదన్నారు. ‘ఎంపీల ఆదర్శ గ్రామ పథకం’ కింద తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో జయపూర్ అనే గ్రామాన్ని శుక్రవారం ఆయన దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. బాలిక అంటే అదో బాధ్యత అనుకునేవాళ్లు జాగ్రత్తగా ఆలోచించాలన్నారు. ఆడ శిశువును గర్భంలోనే హత్యచేస్తే ఈ ప్రపంచానికి ఎంతనష్టమో తెలుసుకోవాలన్నారు. వెయ్యిమంది బాలురకు 800 మంది బాలికలే ఉంటే.. 200 మంది యువకులు అవివాహితులుగానే మిగిలిపోతారన్నారు. ఆ పని ప్రభుత్వం చేయనిస్తుందా అని ప్రశ్నించారు. అనంతరం గ్రామాల పరిస్థితులపై మాట్లాడుతూ.. ప్రతి చిన్న పనికి గ్రామస్థులు ప్రభుత్వంపై ఆధారపడకూడదన్నారు.
ప్రభుత్వం ఇచ్చేది, మేము తీసుకునేవాళ్లమనే భావనను ప్రజలు వదిలిపెట్టాలని చెప్పారు. ఆ గ్రామ ప్రస్తుత పరిస్థితికి గత 60 ఏళ్లుగా ఢిల్లీ, లక్నో పాలకులు చేసినపథకాలే కారణమన్నారు. ఆ కాలంలో పెద్ద పెద్ద నాయకులు ఎన్నో మాటలు చెప్పినా క్షేత్రస్థాయిలో పనులు జరగలేదన్నారు. తానో సామాన్యుడినన్న మోదీ.. తన చిన్న చిన్న మాటలతోనే పెద్ద పెద్ద మార్పులు తీసుకువస్తానన్నారు. స్వయం పారిశ్రామిక నైపుణ్యాలు, కష్టపడేతత్వంతో గ్రామస్థులు తమ గ్రామాల తలరాతను మార్చుకుంటారనే నమ్మకం తనకుందన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద దుర్గాదేవి మాట్లాడారు. ఆ సమయంలో ప్రధాని మోదీ స్వయంగా వెళ్లి మైక్‌ను సరిచేయటం గ్రామ ప్రజల హృదయాలను గెలుచుకుంది.
శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి: పొరుగుదేశంలోని పిల్లల మరణాల్లో 40 శాతం భోజనానికి ముందు చేతులు కడుక్కోకపోవడం వల్ల సంభవించాయని చెప్పిన నివేదికను ఉదహరించిన మోదీ.. తమ బిడ్డల విషయంలో అలా చేయవద్దని గ్రామస్థులను కోరారు. పాఠశాలలకు వెళ్లకపోయినా ఎన్నో జీవిత పాఠాలు గ్రామస్థులకు తెలుసన్నారు. ఆ అనుభవాలే వాళ్లను ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తాయని మోదీ తెలిపారు. ఇక జయపూర్‌ను దత్తత తీసుకోవడంపై మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయడానికి తన నియోజకవర్గం నిర్ణయమైన తర్వాత తాను విన్న మొదటి గ్రామం పేరు జయపూరేనని, అదే ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి కారణమన్నారు.