సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లోని సింగూరులో తన చిన్న కార్ల ఉత్పత్తి ఫ్యాక్టరీ ప్రతిపాదనను విరమించుకుంటున్నానని రతన్ టాటా 2008, ఆగస్టు నెలలో ప్రకటన చేశారు. ఫ్యాక్టరీ కోసం తమ భూములను గుంజుకోరాదంటూ పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వాన పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించడంతో నాడు రతన్ టాటా ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ తక్షణమే స్పందించి రతన్ టాటాకు ఏకపద సందేశం పంపించారు. అదే ‘సుస్వాగతం’. అప్పుడు మోదీతోపాటు ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రంలో చిన్న కార్ల ఫ్యాక్టరీని పెట్టాల్సిందిగా కోరుతూ ఆహ్వానాలు పంపాయి. అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో టాటా సంప్రతింపులు జరిపారు.
అందరికన్నా వేగంగా స్పందించిన నరేంద్ర మోదీ నానో కార్ల తయారీ కోసం టాటా మోటార్స్‌కు ఎన్ని ఎకరాల భూమి కావాలో అన్ని ఎకరాల భూమిని అతి తక్కువ రేటుకు ఇవ్వడానికి, అనేక రాయితీలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. మోదీ ప్రతిపాదనే అందరికన్నా లాభదాయకంగా ఉండడంతో గుజరాత్‌లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు రతన్ టాటా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నింటిని వెల్లడించిన టాటా, మోదీని అధికార దర్పంలేని సాదాసీదా వ్యక్తి అని, మర్యాదస్థుడు, మధుస్వభావి, అన్నింటికన్నా సమర్థుడు అని పొగిడారు.
1,110 ఎకరాల అప్పగింత
గుజరాత్‌లో 1,110 ఎకరాల భూమిని టాటా మోటార్స్‌కు చదరపు కిలోమీటరుకు 900 రూపాయల చొప్పున అప్పగించారు. అప్పుడు మార్కెట్ రేటు చదరపు మీటరుకు పది వేల రూపాయలు ఉండింది. ఆ భూమిపైన 20 కోట్ల రూపాయల స్టాంపు పన్నును పూర్తిగా ఎత్తి వేశారు. 20 ఏళ్లపాటు వ్యాట్‌ను వాయిదా వేశారు. ప్రాజెక్టు పెట్టుబడి మొత్తం 2,900 కోట్ల రూపాయలుకాగా, అందులో మూడో వంతకుపైగా, అంటే 9,570 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం 0.1 శాతం వడ్డీరేటుపై రుణం మంజూరు చేసింది. 85 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే నిబంధన నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.
ఎల్ అండ్ టీ కూడా ఇలాగే
సూరత్‌లోని హజీరా పారిశ్రామిక జోన్‌లో ఎనిమిది లక్షల చదరపు మీటర్ల ప్రైమ్ ల్యాండ్‌ను రూపాయికి చదరపు మీటరు చొప్పున ఎల్ అండ్ టీ సంస్థకు ఇచ్చారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాపైన కొన్ని వందల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడింది. అలాగే సీఆర్‌జెడ్, అటవి ప్రాంతంలో 2.08 లక్షల చదరపు మీటర్ల వివాదాస్పద భూమిని గౌతమ్ అదాని నాయకత్వంలోని ఎస్సార్ గ్రూపునకు కేటాయించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ భూమిని ఎవరికి కేటాయించరాదు. అలాగే 2012లో అంబానీకి చెందిన రిలయెన్స్ ఇండస్ట్రీకి 21 రూపాయి నుంచి 390 రూపాయల వరకు హెక్టార్ చొప్పున పలు హెక్టార్ల భూమిని అప్పగించారు. పారిశ్రామిక మార్గదర్శకాలన్నింటినీ తుంగలో తొక్కి రిలయెన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్, ఎల్ అండ్ టీ కంపెనీలకే కాకుండా ఫోర్డ్ సహా పలు కంపెనీలన్నింటికి అనవసర లబ్ధిని చేకూర్చారంటూ మోదీ ప్రభుత్వంపై కాగ్ అక్షింతలు చల్లింది. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు 5,287.48 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కూడా కాగ్ పేర్కొంది.
కాగ్ 15,100 అభ్యంతరాలు
వివిధ కంపెనీలకు స్థలాలు, ఇతర రూపాల్లో ఇచ్చిన రాయితీలపై కాగ్ 15,100 అభ్యంతరాలను వ్యక్తం చేసింది. 2002 నుంచి 2012 మధ్య అదానీ గ్రూపు మార్కెట్ విలువ 8,615 శాతం పెరగ్గా, అందులో ఒక్క ఎస్సార్ గ్రూపు విలువనే 4,507 శాతం పెరిగింది. ఇక రిలయెన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 1,357 శాతం పెరిగింది. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో ‘వైబ్రంట్ గుజరాత్’ అని పేరు వచ్చింది. దాంతో వేల కంపెనీలు గుజరాత్‌లో కంపెనీలు పెట్టేందుకు క్యూలు కట్టాయి. 2009 నాటికి 12,39,562 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, 2011 నాటికి అవి 20,83,047 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అయితే ఈ స్థాయిలో రాష్ట్రం అభివద్ధి చెందలేదు. నిరుద్యోగ సమస్య తీరలేదు.
నామ మాత్రం రేట్లపై భూములు ఇవ్వడం, వాటిపై స్టాంపు డ్యూటీలను రద్దు చేయడం, భారీగా పన్ను మినహాయింపు ఇవ్వడం, అతితక్కువ వడ్డీపై వాటికి రాష్ట్ర ఖజానా నుంచే రుణాలు మంజూరు చేయడం, 85 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల గుజరాత్ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో అభివద్ధి చెందలేకపోయింది. అయితే ఆ కంపెనీల నుంచి నరేంద్ర మోదీపై ప్రసంశల వర్షం కురిసింది. ‘గొప్పు దక్పథం ఉన్న నాయకుడు మోదీ. అద్భుతమైన లక్ష్యం, అందుకు కావాల్సిన నిబంధత కలిగిన వారు’ 2007లో ముకేశ్ అంబానీ పొగిడారు. కాబోయే భారత ప్రధాని నరేంద్ర మోదీ అని 2013లో అనిల్ అంబానీ పొగిడారు. అంతేకాకుండా మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, ధీరూభాయ్ అంబానీలతోపాటు మహాభారతంలోని అర్జునితో కూడా పోల్చారు. ‘రాజులకే రాజు’ అని కీర్తించారు. మోదీ ప్రధాన మంత్రి అయితే దేశమంతా ‘గుజరాత్ మోడల్’ అభివద్ధి జరుగుతుందని కొన్ని రాజకీయ పార్టీలు ఊదరగొట్టగా ప్రజలు కళలుగన్నారు. మోదీ దక్పథమే వేరవడం వల్ల ఆయన భూములను నమ్ముకుని జీవిస్తున్న రైతులకు ఆయన ఏంచేయలేక పోయారు కాబోలు!
(గమనిక: క్రిష్టఫె జాఫ్రెలాట్ రాసిన ‘బిజినెస్ ఫ్రెండ్లీ గుజరాత్ అండర్ నరేంద్ర మోదీ: ది ఇంప్లికేషన్స్ ఆఫ్ ఏ న్యూ పొలిటికల్ ఎకానమీ, క్రిష్టఫె జాఫ్రెలాట్, అతుల్ కోహ్లీ, కాంటా మురళీ రాసిన ‘బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా’ పుస్తకాల్లోని అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం)
Comments
Please login to add a commentAdd a comment