
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ఒక పదాన్ని రికార్డుల నుంచి తొలగించారు. ‘ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 6.20 నుంచి 6.30 గంటల మధ్య జరిగిన కార్యకలాపాల్లోని కొంత భాగాన్ని రికార్డుల నుంచి తొలగించాలని చైర్మన్ ఆదేశించారు’ అని రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటించింది.
రోజువారీ విధుల్లో భాగంగా రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్యనాయుడు ప్రతీరోజు సభ ముగిసిన తరువాత.. ఆ రోజు ప్రసంగాల్లో రికార్డుల నుంచి తొలగించాల్సిన పదాలను గుర్తించి, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశిస్తుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియనే అని అధికారులు తెలిపారు. అయితే, ప్రధాని మోదీ ప్రసంగంలోని పదాలను తొలగించడం అసాధారణమేనన్నారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను సమర్ధిస్తూ ఆవేశంగా మాట్లాడుతున్న సందర్భంగా ప్రధాని ఆ పదం ఉపయోగించారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ప్రసంగంలోని ఒక పదాన్ని కూడా తొలగించాలని చైర్మన్ ఆదేశించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment