
సవాలు చేస్తే సత్తా చూపిస్తా
- మీ ఇలాకాలోనే గెలిచి సీఎంనవుతా
- బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరిక
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తమ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం ఆర్భాటంగా ప్రారంభించారు. శనివారం సాయంత్రి ఇక్కడ జరిగిన బహిరంగసభలో ఆయన ఆవేశంగా ప్రసంగిస్తూ కాంగ్రెస్, ఎన్సీపీల కన్నా తమ పూర్వ మిత్రుడు బీజేపీపైనే ఎక్కువగా విమర్శనాస్త్రాలు సంధించారు. తమతో తెగదెంపులు చేసుకోవాలని బీజేపీ ముందుగానే నిర్ణయించుకుందని ఆరోపించారు. తాను సీఎం పదవి కోసం ఆత్రుత పడటం లేదని చెప్పా రు. అయితే ‘నన్ను సవాలు చేస్తే... మీకు బాగా పట్టున్న ప్రాంతం నుంచే పోటీ చేసి ముఖ్యమంత్రినవుతా’నని ప్రకటించారు. ‘మహారాష్ట్రకు క్షమాపణ చెబుతున్నాను. పొత్తును విచ్ఛిన్నం చేసింది ఉద్ధవ్ కాదు. చివరివరకూ కూటమిని కాపాడేందుకు ప్రయత్నించాన’ని అన్నారు. మోదీ హవా సాగుతోందనే భ్రమలో ఉండకూడదని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు.
హిందూత్వ బంధాన్ని తెంచుకుంది బీజేపీయేనని విమర్శించారు. కొన్ని సీట్లను మార్చుకునేందుకు కూడా తాను సిద్ధపడ్డానని, అయినా వారు మరిన్ని సీట్లు అడిగారని, శివసేన గోదాము కాదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. హిందూత్వ బంధాన్ని తెంచుకున్నందుకు దేశం వారిని క్షమించబోదన్నారు. మోదీతో తనకు వివాదం లేదని, తమ పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచిందన్నారు. మహారాష్ట్ర తమవైపు చూస్తుండ గా, బీజేపీ తన కాళ్లను తానే నరుక్కుందని అన్నారు. ప్రజల మద్దతు ఎవరికుందో చూపిస్తానన్నారు.
‘సీఎం పదవి కోసం పొత్తును తెంచుకున్నానని అంటున్నారు. మరి మీరు మంత్రాలయలో గోళీలాట ఆడేందుకా ఎక్కువ సీట్లు అడిగారా..’ అని ఆయన ప్రశ్నించారు. ‘మేము మీకు దేశాన్ని ఇచ్చాం. మహారాష్ట్రను మాకిచ్చే ఉదారతను మీరు చూపలేరా’ అంటూ పూర్వం జరిగిన పలు ఘటనలను ఆయన ప్రస్తావించారు. మహారాష్ట్రలో శివసేనకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే విశ్రమించరాదని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.