సాక్షి, చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్‌పోను గురువారం సందర్శించారు. అంతకు ముందు అదే ప్రాంగణంలో 2.90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 685 ఎగ్జిబిషన్ స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన వివిధ దేశాల ఎగ్జిబిషన్ ఆయన ప్రారంభించారు. కాగా ప్రధాని మోదీ ఉదయం 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై పాత విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి...ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహాబలిపురం, అక్కడి నుంచి కారులో డిఫెన్స్ ఎక్స్‌పో మైదానానికి విచ్చేశారు.
ఇక అక్కడి కార్యక్రమాలను ముగించుకుని మరలా చెన్నై విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి కారులో చెన్నై అడయారు కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ వజ్రతోత్సవ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఢిల్లీకి తిరిగి వెళతారు. రాష్ట్రంలో కావేరీపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నల్లజెండాలతో నిరసన తెలుపుతున్న తరుణంలో ప్రధాని పర్యటనకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని ప్రత్యేక భద్రతా దళం అధికారులు నిన్నే చెన్నైకి చేరుకుని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాని ప్రారంభించబోయే ప్రదర్శనశాలకు కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ను తనిఖీ చేశారు. వివిధ హోదాల్లోని రెండువేల మంది పోలీసు అధికారులతోపాటు 60 ప్రత్యేక కమాండోలను రంగంలోకి దించారు.
అలాగే డిఫెన్స్ ఎక్స్‌పోలో భాగంగా కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలో నిన్న (బుధవారం) నిర్వహించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపం తిరువిడందై ఈసీఆర్ రోడ్డులో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో రూ.480 కోట్లతో కేంద్ర రక్షణశాఖ భారీఎత్తున డిఫెన్స్ ఎక్స్‌పోకు రూపకల్పన చేసింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఎక్స్‌పోను ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన డిఫెన్స్ ఎక్స్‌పో భాగస్వామ్యులు, సందర్శకుల రాకతోనూ, వారి వాహనాలతోనూ ఐదు కిలోమీటర్ల మేర ఈసీఆర్ నిండిపోయింది.
47 దేశాలకు చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు, ఫిరంగులు ఈ డిఫెన్స్ ఎక్స్‌పోలో భాగస్వామ్యులై తమ దేశ ప్రతిభను చాటాయి. యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో చక్కర్లు కొడుతూ గుండెలదరగొట్టాయి, తలకిందులుగా ఎగురుతూ పొగలు చిమ్ముతూ చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. అలాగే యుద్ధ ఫిరంగుల విన్యాసాలు అదరగొట్టాయి. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తోపాట 167 దేశాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు తిలకించారు. ఈ ఎక్స్‌పో 14వ తేదీ వరకు నాలుగురోజులపాటు కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment