‘బ్లెయిర్’లో మోదీ బస
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ తన అమెరికా పర్యటనలో వాషింగ్టన్‌లోని ఆ దేశాధ్యక్షుని అధికారిక అతిథిగృహం ‘బ్లెయిర్ హౌస్’లో బస చేయనున్నారు. ఈ నెల 26న మోదీ అమెరికా పర్యటనకు వెడుతున్న సంగతి తెలిసిందే. 29న మోదీ ఈ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. పదేళ్ల కిందట భారతప్రధాని హోదాలో అమెరికా వెళ్లిన వాజ్‌పేయి ఇందులోనే బస చేశారు. 1824లో ప్రైవేట్‌భవనంగా నిర్మితమైన ఈ బ్లెయిర్ హౌస్‌కు 190 ఏళ్ల చరిత్ర ఉంది. రెండవప్రపంచయుద్ధకాలంలో దీనిని అమెరికా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అమెరికా రాజకీయ, దౌత్య,సాంస్కృతిక వ్యవహారాల్లో ఈ అతిథిగృహం కీలకపాత్ర పోషించింది. కాగా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ భవనంలో ఉండడానికి ఇష్టపడలేదని సమాచారం.
బిజీబిజీగా ప్రధాని పర్యటన...
ఈ నెల 26న మొదట న్యూయార్క్ చేరుకునే మోదీ అక్కడ మన్‌హట్టన్‌లోని పేలస్‌హోటల్‌లో దిగుతారు. 27న గ్రౌండ్‌జీరో చేరుకుని అల్‌కాయిదా దాడుల్లో వరల్డ్‌ట్రేడ్‌సెంటర్ నేలకూలినచోట నిర్మించిన స్మారక మ్యూజియాన్ని సందర్శిస్తారు. అనంతరం ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి వెడతారు. అ 28న యూదుబృందాలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ‘మేడిసన్ స్క్వేర్ గార్డెన్’లో భారతఅమెరికన్లనుద్దేశించి ప్రసంగిస్తారు. 29న అమెరికా అధ్యక్షుడు ఒబాబా మోదీకి విందు ఇస్తారు. 30న ఉభయదేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి.
అమెరికా పర్యటనలో మోదీ ఉపవాసం..
అమెరికా పర్యటన సందర్భంగా మోదీ పళ్లు, నిమ్మరసంతోనే సరిపెట్టుకోనున్నారు. విందుల్లో పళ్లు, ఫలహారాలకే పరిమితం కానున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసాలు చేసే మోదీ అమెరికా పర్యటనలోనూ వాటిని పాటించనున్నారు.