
చేనేతను వాడండి
ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
న్యూఢిల్లీ: చేనేత రంగం అభివృద్ధి వల్ల లక్షలాది మంది నేతన్నలకు ఉపాధి కల్పించడమే కాక.. మహిళా సాధికారతకు తోడ్పాటును అందిస్తుందని, అందువల్ల దేశ ప్రజలంతా దైనందిన జీవనంలో చేనేత ఉత్పత్తుల వినియోగం పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రధాని మోదీ ట్వీటర్‌లో స్పందిస్తూ.. ‘‘మన చేనేత రంగం విభిన్నమైనది. పర్యావరణ అనుకూలమైంది.
లెక్కలేనంత మంది నేతన్నలకు ఉపాధి వనరుగా ఉంది. దీనంతటికీ మనం అందిస్తున్న ప్రోత్సాహమే కారణం’’ అని పేర్కొన్నారు. చేనేత రంగంతో అనేక మహిళలు కూడా ఆధారపడి జీవిస్తున్నారని, అందువల్ల ఈ రంగం అభివృద్ధి మహిళా సాధికారతకు తోడ్పడుతుందని వివరించారు. మనం చేనేత రంగానికి పోత్సాహకంగా నిలవాలని, రోజువారీ కార్యకలాపాల్లో చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ‘దేశం కోసం ఖాదీ.. ఫ్యాషన్ కోసం ఖాదీ(ఖాదీ ఫర్ నేషన్.. ఖాదీ ఫర్ ఫ్యాషన్)’ ఇదే మన మార్గదర్శక సూత్రంగా ఉండాలని శనివారం నాటి టౌన్‌హాల్ తరహా మీట్‌లో ప్రధాని మోదీ పిలుపునివ్వడం తెలిసిందే.
చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టులాంటిదని, అందువల్ల 125 కోట్ల మంది భారతీయులు తమ దుస్తుల్లో 5 శాతం ఖాదీ, చేనేత వస్త్రాలను వినియోగించాలన్నారు. చేనేత రంగానికి సంపూర్ణ మద్దతు ఇస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సమూలంగా మారిపోతుందన్నారు. దీని కో సం గ్లోబల్ మార్కెటింగ్‌కు ఈ ప్లాట్‌ఫామ్.. నేతన్నకు సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు.