
ఆ సూటు నిండా.. మోదీ పేర్లే!!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించిన తర్వాత రాష్ట్రపతి భవన్కు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోదీ ఓ నల్లటి బంద్ గలా సూట్ వేసుకున్నారు. అయితే దానిమీద బంగారు వర్ణంతో చారల్లాంటి డిజైన్ కనిపించింది. ఇదేంటో.. చారల సూటు అనే అంతా అనుకున్నారు. కానీ, ఆ ఫొటోలను క్లోజప్లో చూస్తే అసలు విషయం తెలిసింది. ఆ చారలన్నీ వాస్తవానికి నరేంద్ర మోదీ పేర్లే! అవును.. ఆయన పూర్తి పేరయిన నరేంద్ర దామోదర్దాస్ మోదీ అనే పేరును బంగారు వర్ణం అక్షరాలుగా దానిమీద కుట్టారు. తొలుత విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కుర్తా పైజమా ధరించి, దానిమీద నెహ్రూ జాకెట్, శాలువా వేసుకుని వెళ్లారు. తర్వాత రాష్ట్రపతి భవన్లో అధికారికంగా స్వాగతం చెప్పేటప్పుడు మాత్రం సూటు మార్చుకున్నారు. అదే సూటుతో హైదరాబాద్ హౌస్లో 'చాయ్ పే చర్చా' కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
ఈ సూటును అహ్మదాబాద్కు చెందిన జేడ్ బ్లూ సంస్థ తయారుచేసింది. మోదీ దుస్తులన్నింటినీ వాళ్లే తయారుచేస్తారు. మోదీ కుర్తాలను డిజైన్ చేసింది కూడా వీళ్లేనని అంటారు. ఆ డిజైన్కు ఎంతగానో ముచ్చట పడిన ఒబామా.. ఆ తరహా కుర్తాలు వేసుకోవాలని తనకూ ఉన్నట్లు వెల్లడించారు.
గతంలో ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కూడా ఇలా తన పేరును సూటు మీద కుట్టించుకుని వేసుకున్నారు. ఆయన మామూలు టూ పీస్ సూట్ వేసుకుని, దాని కాలర్ సహా మొత్తం సూటంతా తన పేరు కుట్టించుకున్నారు. ఆ తర్వాత ఇలా చేసింది మోదీ ఒక్కరేనని అంటున్నారు.