
మీ పర్యటనతో కొత్త అధ్యాయం
ట్వీటర్‌లో ఒబామాను ఉద్దేశించి మోదీ
న్యూఢిల్లీ: ఒబామా పర్యటన భారత్-అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్లిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రెండు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఒబామా సౌదీ అరేబియాకు బయల్దేరిన అనంతరం మోదీ ఈ మేరకు ట్వీటర్‌లో వ్యాఖ్యానించారు. ‘‘ఒబామాకు వీడ్కోలు. మీ ప్రయాణం సురక్షితంగా జరగాలని ఆకాంక్షిస్తున్నా.
మీ పర్యటనతో రెండుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి’’ అని మోదీ అన్నారు. వైట్‌హౌస్ కూడా దీనికి స్పందించింది. ‘‘ఒబామా పర్యటనను ఎల్లకాలం గుర్తుండిపోయేలా మలిచినందుకు థాంక్యూ నరేంద్రమోదీ. ఆత్మీయ స్వాగతం పలికిన భారత ప్రజలకు కృతజ్ఞతలు’’ అంటూ అధ్యక్షుడి కార్యాలయం బదులిచ్చింది. దీన్ని మోదీ ట్వీటర్‌లో పొందుపరిచారు. గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో చిరుజల్లులు కాస్త ఇబ్బంది కలిగించిన విషయాన్ని కూడా మోదీ తనదైన శైలిలో ప్రస్తావించారు.