న్యూఢిల్లీ: తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం భారత్-రష్యా మైత్రిలో మైలురాయని భారత ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. అణువిద్యుత్ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముగ్గురు అధినేతలు జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. రష్యా రాజధాని మాస్కోలో అధ్యక్షుడు పుతిన్, ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై సచివాలయంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆశీనులై అణువిద్యుత్ కేంద్రాన్ని సంయుక్తంగా జాతికి అంకితం చేశారు. తిరునల్వెలి జిల్లా కూడంకుళంలో భారత్-రష్యాలు సంయుక్తంగా రూ.22వేల కోట్లతో రెండు యూనిట్ల అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్-రష్యా మధ్య సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందన్నారు. ఇరుదేశాలు సంయుక్తంగా మరిన్ని అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండు దేశాల ఇంజినీర్లు కఠోర శ్రమకు వందనం అని మోదీ ప్రశంసించారు. ముందుగా మోదీ భారత్, రష్యా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అణువిద్యుత్ కేంద్రం స్థాపనతో రష్యా దేశానికి భారతీయులు రుణపడి ఉన్నారని పేర్కొన్నారు.
ఒకేచోట వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే తొలి కేంద్రం ఇదే కావడం గర్వకారణమని అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి తమిళంలో చెప్పారు. ఈ అణువిద్యుత్ కేంద్ర వాతావరణ, పర్యావరణ సమస్యలకు తావులేకుండా దేశాభివృద్ధికి దోహదం చేయగలదని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్-రష్యా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం శాశ్వతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు రష్యా భాషలో మోదీ చెప్పారు. అణువిద్యుత్ కేంద్రాన్ని అందించిన రష్యా అధ్యక్షులు పుతిన్‌కు, రష్యా ప్రజలకు జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. కాగా, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కూడంకుళం ప్లాంటును మూసివేయాలంటూ రెండేళ్లుగా స్థానిక ప్రజలు పోరాడుతున్న సంగతి తెలిసిందే.
ఇవీ ప్లాంటు ప్రత్యేకతలు:
1. కేఎన్‌పీపీ దేశంలో నిర్మించిన 21వ అణువిద్యుత్ రియాక్టర్. దేశంలో తొలి ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ కూడా ఇదే.
2. రెండు యూనిట్లలోని రియాక్టర్లు అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో కూడిన థర్డ్ జనరేషన్ రియాక్టర్లు.
3. రెండు రియాక్టర్లూ వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పనిచేయగలవు.
4. గత అక్టోబరు నుంచి పనిచేస్తున్న యూనిట్ 1 నుంచి ఇప్పటిదాకా 190 కోట్ల యూనిట్ల విద్యుత్ దక్షిణ గ్రిడ్‌కు అందింది.