సాక్షి, న్యూఢిల్లీ : భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజ్‌పథ్ వేదికగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోస దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ సందర్బంగా ఇండియన్ ఆర్మీ 21 గన్ సెల్యూట్ చేసింది. కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీకి ప్రకటించిన అశోకచక్ర అవార్డును ఆయన సతీమణికి రాష్ట్రపతి అందజేశారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్ త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిద దళాల అధిపతులు నివాళులర్పించి రాజ్‌పథ్‌కు చేరుకున్నారు.
త్రిశూలం ఆకారంలో విన్యాసాలు..
రిపబ్లిక్ వేడుకల అతిథిగా వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోస ప్రధాని నరేంద్రమోదీ పక్కనే ఆసీనులై కవాతును, శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. వైమానిక దళం జరిపిన ఆకాశ విన్యాసాలు కనువిందు చేశాయి. త్రిశూలం ఆకారంలో సుఖోయ్ యుద్ధవిమానాలు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
18 వేల మీటర్ల ఎత్తులో త్రివర్ణ పతాకం..
మంచు పటాలంగా చెప్పుకునే ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బెటాలియన్ భారత 70వ గణతంత్ర దినోత్సవం సదర్భంగా త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారు. భారత్ మాతా కీ జై.. అంటూ నినాదాలు చేస్తూ.. జాతీయ జెండాను చేతబూని కవాతు చేశారు. వీరు 18 వేల మీటర్ల ఎత్తులో గల లడక్ హిమ ప్రాంతంలో, జీరో డిగ్రీల చలిలో విధులు నిర్వహిస్తున్నారు. మైనస్ 30 వరకు ఇక్కడ ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. ఇక ఎవరెస్టు 3 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ఉండగా.. ఐటీబీపీ దళం దాదాపు 18 కిలోమీటర్ల ఎత్తులో రక్షణ సేవలందిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment