హంగుఆర్భాటాలను ఇష్టపడేవాళ్లు ఫంక్షన్ హాళ్లలో.. భాజాభజంత్రీల మధ్య ఘనంగా పెళ్లి చేసుకుంటారు. అలాంటప్పుడు ప్రకృతిని ఇష్టపడేవాళ్లు ప్రకృతి ఒడిలో కాకుండా వేరే చోట పెళ్లెలా చేసుకుంటారు...? అంటూ ప్రశ్నిస్తున్నాడు అరవింద్. అయితే అరవింద్ ఇలా ప్రశ్నించడాన్ని చాలామంది సమర్థిస్తున్నారు. అతని ‘మొక్క’వోని దీక్ష చూసి ముచ్చట పడుతున్నారు. ఇంతకీ అరవింద్ ఏం చేశాడో తెలుసా..
సేలం: నేచర్ లవర్స్ అయిన ఓ జంట వినూత్నంగా పెళ్లి చేసుకొని వార్తల్లోకెక్కింది. సరస్సు మధ్యలో తాము స్వయంగా ఏర్పాటుచేసుకున్న ఓ చిన్న లంకలో పెళ్లి చేసుకొని అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. వీరిద్దరి పెళ్లి ప్రత్యేకంగా జరగడానికి ఓ కారణముంది. అదేంటంటే.. ఇద్దరూ ప్రకృతి ప్రేమికులే! పెళ్లి తర్వాత కూడా దంపతులిద్దరూ కలిసి మొక్కలను నాటారు. పెళ్లికి వచ్చిన వారితోనూ మొక్కలు నాటించారు. ఆ జంటే తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన పూవిళీ, అరవింద్.
ధర్మపురికి చెందిన పూవిళికి చిన్నతనం నుంచి మొక్కలంటే ఇష్టం. ఏ మాత్రం అవకాశం వచ్చినా పచ్చని మొక్కల మధ్యే కాలక్షేపం చేసేది. ఆమెకు కొన్నాళ్లక్రితం అరవింద్ పరిచయమయ్యాడు. అతను పెద్దగా చదువుకోలేదు. కానీ సేలంలో 53 ఎకరాల మూకనేరి సరస్సును స్థానికులు కలుషితం చేస్తుంటే మరికొందరి యువకులతో కలిసి అడ్డుపడేవాడు. వీళ్లంతా కలిసి శుభ్రం చేస్తున్నా గ్రామస్థుల్లో మార్పు రాకపోవడంతో 2010 నుంచి ఈ సరస్సులో అక్కడక్కడా చిన్నచిన్న మట్టిలంకలను ఏర్పాటు చేసి మొక్కలను నాటడం ప్రారంభించాడు. ఈ ఆరేళ్లలో 46 దీవులను తయారుచేశాడు. ఇప్పటివరకూ ఆ దీవుల్లో 12 వేల మొక్కలు నాటారు. ఆ క్రమంలోనే పూవిళి, అరవింద్ మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఆ సరస్సు మధ్యలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సేలంలోని మూకనేరి సరస్సులో 47వ దీవిని రూపొందించి అందులోనే ఇద్దరూ ఒకటయ్యారు. తరవాత ఇద్దరూ మొక్కను నాటడమే కాదు, వాళ్లకు కానుకలుగా వచ్చిన ఎనభై రెండు వేల రూపాయల్ని ముకనేరి సరస్సు పరిరక్షణకు అందించారు. దాంతోపాటూ మరో వెయ్యి మొక్కల్ని నాటేందుకు సిద్ధమయ్యారు. అంతేనా.. పెళ్లికి వచ్చిన ప్రతి అతిథితోనూ తలా ఓ మొక్క నాటించారు. పెళ్లంతా అయ్యాక గ్రామంలో విందు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment