సాక్షి,చెన్నై : చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో జరిగిన నాట్యాంజలి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాట్య కళాకారులు ఏటా నటరాజ స్వామి ముందు తమ నాట్యంతో అంజలి ఘటించటం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. నాట్యం అభ్యసించిన ప్రతి కళాకారుడు నటరాజ స్వామికి తమ నాట్యాన్ని అంకితం చేస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే కొన్నేళ్లుగా నటరాజ స్వామి ఆలయంలో నాట్యాంజలి పేరుతో నాట్యోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగానే 2017లో 4525 మంది నాట్య కళాకారులు ఒకే వేదికపై చేసిన నాట్యాంజలి రికార్డు సృష్టించింది. అయితే ఈ ఏడాది కూడా నాట్యంజలిలో గిన్నిస్ రికార్డు సృష్టించాలని నిర్ణయించారు. దీక్షితుల నిర్వహణలో కొనసాగుతున్న ఈ ఆలయంలో ఈ ఏడాది నాట్యాంజలిని రికార్డు చేసేందుకు గిన్నిస్ బుక్ వారిని ఆహ్వానించారు.
దీంతో ప్రఖ్యాత నాట్య కళాకారిణి గురు పద్మభూషణ్ పద్మసుబ్రమణ్యం నేతృత్వంలో 19 వేల నాట్య కళాకారులతో నాట్యంజలి నిర్వహించారు. ఇందులో తమిళనాడు నలుమూలల నుంచి 7195 మంది నాట్య కళాకారులు ఒకే వేదికపై నటరాజస్వామికి తమ నాట్యంతో అంజలి ఘటించారు. తద్వారా గతంలో ఉన్న 4 వేల మంది నాట్యాంజలి రికార్డు తిరగరాశారు. గిన్నిస్ ప్రతినిధి రిషినాధ్ ఆలయ దీక్షితులకు రికార్డు పత్రాన్ని అందచేశారు. ఒకే వేదికపై 7 వేల మంది నాట్యకళాకారులు తమ అభినయంతో నటరాజ స్వామికి నాట్యాంజలి అందించటం చిదంబరం ఆలయంలో వేడుకను తలపించింది.
Comments
Please login to add a commentAdd a comment