
న్యూఢిల్లీ: నావికా బలాన్ని అమాంతం పెంచుకుంటున్న చైనా, హిందూ మహాసముద్రం మీదుగా ఏడు యుద్ధ నౌకలను తరలించింది. అయితే భారత నిఘా విమానాలు ఈ యుద్ధనౌకల ఫొటోలను చిత్రీకరించి ఉన్నతాధికారులకు పంపాయి. దాదాపు 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైనిక వాహనాలు, హెలికాప్టర్లను తరలించే సామర్థ్యమున్న గ్జియాన్–32తో పాటు ఆరు యుద్ధనౌకలు సెప్టెంబర్ నెల ఆరంభంలో ‘గల్ఫ్ ఆఫ్ అడెన్’కు బయలుదేరాయి. అక్కడికి చేరుకునేందుకు వీలుగా ఏకైక మార్గమైన హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాయి. ‘భారత తీరానికి దగ్గరగా వచ్చే నౌకలను మేం గమనిస్తూనే ఉన్నాం. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో పైరెట్లను ఎదుర్కొనేందుకు వీలుగా చైనా ఈ నౌకలతో విన్యాసాలు నిర్వహించనుంది’ అని భారత నేవీ అధికారి ఒకరు తెలిపారు.