ముంబై : మహ్మద్ అలీ జిన్నాపై పట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలను ఎన్సీపీ నేత మజీద్ మెమన్ సమర్ధించారు. స్వాతంత్ర పోరాటంలో జిన్నా విశేష సేవలందించారని, ఆయన ముస్లిం అయినందునే జిన్నాకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. ఇదే కారణంతో శత్రుఘ్న సిన్హాపై కాషాయ పార్టీ దేశ వ్యతిరేకి అనే ముద్ర వేసిందని దుయ్యబట్టారు.
సిన్హా నిన్న మొన్నటి వరకూ బీజేపీలో ఉన్నందున ఆయన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే అది కాషాయ పార్టీ బోధించినవేనని గుర్తురగాలని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఓ ప్రచార ర్యాలీని ఉద్దేశించి శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పాక్ వ్యవస్ధాపకుడు జిన్నా వంటి దిగ్గజ నేతలున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీని వీడి తాను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరానో వివరిస్తూ గాంధీ, నెహ్రూ, జిన్నా, సుభాష్ చంద్ర బోస్, ఇందిరా, రాజీవ్‌గాంధీ వంటి నేతలు తీర్చిదిద్దిన పార్టీ ఇదని, దేశ అభివృద్ధికి, స్వాతంత్ర సముపార్జనకు కాంగ్రెస్ విశేష కృషిచేసిందని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా, సిన్హా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడటంతో తాను పొరపాటున నోరుజారానని తాను మౌలానా అబ్ధుల్ కలాం ఆజాద్ పేరు చెప్పబోయి జిన్నా అని చెప్పానని ఆయన వివరణ ఇచ్చారు. కాగా శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి తలపడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment