ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. శనివారం షోలాపూర్‌లో జరిగిన పతంజలి ఉత్పత్తుల ప్రచార కార్యక్రమానికి హజరైన అమృత ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు. పతంజలి ఉత్పత్తులకు ఎలాంటి మార్కెట్‌ను కల్పిస్తున్నారో స్వయం ఉపాధి మహిళా సంఘాలు తయారుచేసే ఉత్పత్తులకు కూడా అలాంటి మార్కెట్ సదుపాయాలనే కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో మహిళా కార్యకర్తలు వేదికకు వెలుపలకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కార్యక్రమం పూర్తయిన తర్వాత విడుదల చేశారు.
ఈ ఘటనలో ఎవరి మీద కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కోన్నారు. పతంజలి ఉత్పత్తులను ప్రజలు గుడ్డిగా నమ్ముతారని అమృత ఫడ్నవీస్ అన్నారు. పతంజలి ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని బాబా రాం దేవ్, దేశ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, రాజ్యసభ ఎంపీ హేమమాలిని కూడా హజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment