Self Help Group
-
సంపూర్ణ స్వావలంబనేది?
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో మహిళ సంఘాల సామాజిక, ఆర్థికాభివృద్ధిలో అంతరం కనిపిస్తోంది. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సంఖ్య భారీగా కనబడుతున్నా ఆర్థిక స్వావలంబనను కొన్ని సంఘాలు మాత్రమే సాధించగలుగుతున్నాయి. మిగతా సంఘాలు వెనకబడుతున్నాయి. బ్యాంక్ లింకేజీకే అర్హత సాధించని పరిస్థితి వేలాది ఎస్హెచ్జీలది. ఒకవేళ అర్హత సాధించినా రుణంపొందినవి 40 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. రుణ ప్రయోజనం పొందడంలో సంఘాల సంఖ్య గతేడాదితో పోల్చితే భారీగా తగ్గింది. ఏటేటా సంఘాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సంపూర్ణ స్వావలంబన సాధించడంలో గ్రామీణాభివృద్ధి సంస్థ పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక పరిపుష్టి ఏదీ.. మహిళ స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా పరిపుష్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మహిళలు సైతం పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణించాలని.. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలన్నా.. ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తుంది. తీసుకున్న రుణాలతో మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారు. ఎంతో ఆశతో ఈ సంఘాల్లో చేరుతున్న మహిళలకు నిరాశే ఎదురవుతోంది. రుణ చెల్లింపుల్లో పలు సంఘాలు వెనుకబడటం, వీటి కారణంగా గ్రామాఖ్య సంఘాలు, వాటి నుంచి మండల సమాఖ్యలు ఇలా ఒకదానికొకటి వెనుకబడుతున్నాయి. అదే సమయంలో మహిళ సంఘాల ఆర్థిక పరిపుష్టికి కృషి చేయాల్సిన సిబ్బంది చేతివాటం కారణంగా మహిళ సంఘాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఒక సంఘానికి రుణం మంజూరు చేసేందుకు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇందులో కిందినుంచి పైవరకు పంపకాలు ఉండడంతోనే పరిస్థితులు ఇలా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో మహిళ సంఘాలు తీసుకున్న రుణంపై పావలా వడ్డీ చెల్లిస్తుండగా, వాటిని తిరిగి సంఘాల ఖాతాల్లో జమ చేయాలి. అయితే రెండేళ్లుగా పావలా వడ్డీ జమ కాకపోవడంతో పలు సంఘాలు ఆర్థికంగా నష్టాలను చవిచూస్తున్నాయి. జిల్లాలో సుమారు రూ.30కోట్ల వరకు పావలా వడ్డీ కింద మహిళ సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. రుణ లక్ష్యంలో 62 శాతమే ప్రగతి.. మహిళ సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద 2017–18 సంవత్సరం కోసం ప్రభుత్వం నిర్దేషించిన రుణ లక్ష్యంలో కేవలం 62 శాతం మాత్రమే ప్రగతి కనిపిస్తోంది. బ్యాంక్ లింకేజీ కింద అనేక సంఘాలు రుణం పొందేందుకు అర్హత సాధించినప్పటికి చివరికి 40 శాతం సంఘాలకు మాత్రమే ఈ ప్రయోజనం దక్కింది. మిగతా 60 శాతం సంఘాలు రుణం పొందలేకపోయాయి. 2016–17 కంటే 2017–18కి బ్యాంక్ లింకేజీ కింద రుణ లక్ష్యం భారీగా పెంచినప్పటికీ ప్రగతి మాత్రం అందుకోలేకపోయింది. గతేడాది 99.87 శాతం ప్రగతి సాధించగా, ఈఏడాది 62 శాతానికే పరిమితం కావడం గమనార్హం. గతేడాదితో పోల్చితే రుణ ప్రయోజనం పొందిన సంఘాల సంఖ్య అమాంతంగా తగ్గిపోవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు ఈ అవాంతరాన్ని సరిదిద్దాల్సి ఉండగా, సరైన చర్యలు చేపట్టకపోవడంతోనే పరిస్థితి ఇలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రికవరీ కాకపోవడంతోనే.. జిల్లాలో ఈ ఏడాది మహిళ సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రుణ మంజూరులో ప్రధాన బ్యాంకులు సహకరించలేదు. ఈ కారణంగానే రుణ మంజూరులో తక్కువ శాతం నమోదైంది. అదే సమయంలో గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో బ్యాంక్ లింకేజీ తక్కువగా ఉండటం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. గతంలో రుణం తీసుకున్న సంఘాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ లింకేజీకి అర్హత సాధించలేకపోయాయి. రికవరీ పూర్‌గా ఉండటం కూడా వీటన్నింటికి కారణమైంది. ఈ లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. – రాజేశ్వర్ రాథోడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
సీఎం భార్యకు చేదు అనుభవం
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. శనివారం షోలాపూర్‌లో జరిగిన పతంజలి ఉత్పత్తుల ప్రచార కార్యక్రమానికి హజరైన అమృత ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు. పతంజలి ఉత్పత్తులకు ఎలాంటి మార్కెట్‌ను కల్పిస్తున్నారో స్వయం ఉపాధి మహిళా సంఘాలు తయారుచేసే ఉత్పత్తులకు కూడా అలాంటి మార్కెట్ సదుపాయాలనే కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో మహిళా కార్యకర్తలు వేదికకు వెలుపలకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కార్యక్రమం పూర్తయిన తర్వాత విడుదల చేశారు. ఈ ఘటనలో ఎవరి మీద కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కోన్నారు. పతంజలి ఉత్పత్తులను ప్రజలు గుడ్డిగా నమ్ముతారని అమృత ఫడ్నవీస్ అన్నారు. పతంజలి ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని బాబా రాం దేవ్, దేశ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, రాజ్యసభ ఎంపీ హేమమాలిని కూడా హజరయ్యారు. -
కొత్తగా లక్ష నల్లా కనెక్షన్లు
బీపీఎల్ కుటుంబాలకు రూ.1కే కనెక్షన్.. ‘భగీరథ’ విజయవంతం తీరనున్న శివారు ప్రజల దాహార్తి సిటీబ్యూరో: ‘గ్రేటర్’లో పట్టణ భగీరథ పథకం సత్ఫలితాలిస్తోంది... త్వరలో శివారు ప్రజల దాహార్తి తీరనుంది.. ఈ నెలలోనే కొత్తగా ‘లక్ష’ నల్లా కనెక్షన్లు ఇస్తారు. ఇందులో బీపీఎల్ కుటుంబాలకు రూ. 1కే కనెక్షన్ మంజూరు చేస్తారు. దరఖాస్తు అందిన 2–3 రోజుల్లోనే నల్లా బిగిస్తారు. ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో సోమవారం పట్టణ భగీరథ ప్రాజెక్టు, నిర్వహణ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ ఈ విషయం వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న పేదలకు, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బోర్డు గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది.. వారి ఇంటికి వెళ్లి కొత్త కనెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూపాయికే నల్లా.. బీపీఎల్ కుటుంబాలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని ఎండీ ఆదేశించారు. దీనికి అదనంగా ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. సాధారణ వినియోగదారులు మాత్రం రోడ్డు కటింగ్ ఛార్జీలతో పాటు ఇంటి నిర్మాణ విస్తీర్ణం, అంతస్తులను బట్టి నల్లా కనెక్షన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కొత్త నల్లా ఛార్జీలను డెబిట్ , క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించే సదుపాయం కల్పించినట్లు దానకిషోర్ తెలిపారు. ప్రతిసెక్షన్ మేనేజర్ రాబోయే మూడునెలల్లో నూతన నల్లా కనెక్షన్ల జారీకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ,ప్రాజెక్టు విభాగం డైరెక్టర్లు డి.శ్రీధర్‌బాబు, ఎల్లాస్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆటోనగర్ నడిగడ్డ తండాలో ట్రయల్‌రన్.. ఆటోనగర్ నడిగడ్డ తండాలో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్ పరిసరాల్లోని నిరుపేదలు, ఇతర వినియోగదారులకు నూతన నల్లా కనెక్షన్లను ఏర్పాటు చేసి త్వరలో నీటిసరఫరా చేసేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తామని దానకిశోర్ తెలిపారు. జలమండలి సిబ్బంది కంప్యూటర్లు, స్కానర్లతో ఆయా బస్తీలకు వెళ్లి క్షేత్రస్థాయిలో వినియోగదారులు, నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. అక్కడికక్కడే వినియోగదారుని వివరాలను తనిఖీ చేసి నల్లా కనెక్షన్లు మంజూరీ చేయాలని సూచించారు. వినియోగదారులకు తక్షణ సాయం అందించేందుకు క్షేత్రస్థాయిలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ సభ్యులతో కలిసి కొత్త నల్లా కనెక్షన్ల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎండీ తెలిపారు. ఈ నెలలో 12 రిజర్వాయర్లు ప్రారంభం.. మహానగరంలో విలీనమైన శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1900 కోట్ల హడ్కో నిధులతో చేపట్టిన 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లలో 12 రిజర్వాయర్లను ఏప్రిల్ నెలలోనే ప్రారంభిస్తామన్నారు. శివార్లలో తాగునీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేని వందలాది బస్తీలు, కాలనీల్లో నూతన నల్లాకనెక్షన్ల జారీకి ఇప్పటివరకు 1800 కి.మీ మార్గంలో తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో నూతనంగా రెండు లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశామని దానకిశోర్ తెలిపారు. కాగా జలమండలి పరిధిలో ప్రస్తుతం 9.65 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. నూతనంగా ఇచ్చే కనెక్షన్లతో వీటి సంఖ్య 11.65 లక్షలకు చేరుకోనుండటం విశేషం.