ఎస్‌హెచ్‌జీ సంఘాల సభ్యులు (ఫైల్)
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో మహిళ సంఘాల సామాజిక, ఆర్థికాభివృద్ధిలో అంతరం కనిపిస్తోంది. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సంఖ్య భారీగా కనబడుతున్నా ఆర్థిక స్వావలంబనను కొన్ని సంఘాలు మాత్రమే సాధించగలుగుతున్నాయి. మిగతా సంఘాలు వెనకబడుతున్నాయి. బ్యాంక్ లింకేజీకే అర్హత సాధించని పరిస్థితి వేలాది ఎస్‌హెచ్‌జీలది. ఒకవేళ అర్హత సాధించినా రుణంపొందినవి 40 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. రుణ ప్రయోజనం పొందడంలో సంఘాల సంఖ్య గతేడాదితో పోల్చితే భారీగా తగ్గింది. ఏటేటా సంఘాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సంపూర్ణ స్వావలంబన సాధించడంలో గ్రామీణాభివృద్ధి సంస్థ పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆర్థిక పరిపుష్టి ఏదీ..
మహిళ స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా పరిపుష్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మహిళలు సైతం పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణించాలని.. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలన్నా.. ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తుంది. తీసుకున్న రుణాలతో మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారు. ఎంతో ఆశతో ఈ సంఘాల్లో చేరుతున్న మహిళలకు నిరాశే ఎదురవుతోంది.
రుణ చెల్లింపుల్లో పలు సంఘాలు వెనుకబడటం, వీటి కారణంగా గ్రామాఖ్య సంఘాలు, వాటి నుంచి మండల సమాఖ్యలు ఇలా ఒకదానికొకటి వెనుకబడుతున్నాయి. అదే సమయంలో మహిళ సంఘాల ఆర్థిక పరిపుష్టికి కృషి చేయాల్సిన సిబ్బంది చేతివాటం కారణంగా మహిళ సంఘాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఒక సంఘానికి రుణం మంజూరు చేసేందుకు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇందులో కిందినుంచి పైవరకు పంపకాలు ఉండడంతోనే పరిస్థితులు ఇలా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అదే సమయంలో మహిళ సంఘాలు తీసుకున్న రుణంపై పావలా వడ్డీ చెల్లిస్తుండగా, వాటిని తిరిగి సంఘాల ఖాతాల్లో జమ చేయాలి. అయితే రెండేళ్లుగా పావలా వడ్డీ జమ కాకపోవడంతో పలు సంఘాలు ఆర్థికంగా నష్టాలను చవిచూస్తున్నాయి. జిల్లాలో సుమారు రూ.30కోట్ల వరకు పావలా వడ్డీ కింద మహిళ సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.
రుణ లక్ష్యంలో 62 శాతమే ప్రగతి..
మహిళ సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద 2017–18 సంవత్సరం కోసం ప్రభుత్వం నిర్దేషించిన రుణ లక్ష్యంలో కేవలం 62 శాతం మాత్రమే ప్రగతి కనిపిస్తోంది. బ్యాంక్ లింకేజీ కింద అనేక సంఘాలు రుణం పొందేందుకు అర్హత సాధించినప్పటికి చివరికి 40 శాతం సంఘాలకు మాత్రమే ఈ ప్రయోజనం దక్కింది. మిగతా 60 శాతం సంఘాలు రుణం పొందలేకపోయాయి. 2016–17 కంటే 2017–18కి బ్యాంక్ లింకేజీ కింద రుణ లక్ష్యం భారీగా పెంచినప్పటికీ ప్రగతి మాత్రం అందుకోలేకపోయింది.
గతేడాది 99.87 శాతం ప్రగతి సాధించగా, ఈఏడాది 62 శాతానికే పరిమితం కావడం గమనార్హం. గతేడాదితో పోల్చితే రుణ ప్రయోజనం పొందిన సంఘాల సంఖ్య అమాంతంగా తగ్గిపోవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు ఈ అవాంతరాన్ని సరిదిద్దాల్సి ఉండగా, సరైన చర్యలు చేపట్టకపోవడంతోనే పరిస్థితి ఇలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రికవరీ కాకపోవడంతోనే..
జిల్లాలో ఈ ఏడాది మహిళ సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రుణ మంజూరులో ప్రధాన బ్యాంకులు సహకరించలేదు. ఈ కారణంగానే రుణ మంజూరులో తక్కువ శాతం నమోదైంది. అదే సమయంలో గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో బ్యాంక్ లింకేజీ తక్కువగా ఉండటం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. గతంలో రుణం తీసుకున్న సంఘాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ లింకేజీకి అర్హత సాధించలేకపోయాయి. రికవరీ పూర్‌గా ఉండటం కూడా వీటన్నింటికి కారణమైంది. ఈ లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం.
– రాజేశ్వర్ రాథోడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
Comments
Please login to add a commentAdd a comment