కొత్తగా లక్ష నల్లా కనెక్షన్లు
బీపీఎల్ కుటుంబాలకు రూ.1కే కనెక్షన్..
‘భగీరథ’ విజయవంతం
తీరనున్న శివారు ప్రజల దాహార్తి
సిటీబ్యూరో: ‘గ్రేటర్’లో పట్టణ భగీరథ పథకం సత్ఫలితాలిస్తోంది... త్వరలో శివారు ప్రజల దాహార్తి తీరనుంది.. ఈ నెలలోనే కొత్తగా ‘లక్ష’ నల్లా కనెక్షన్లు ఇస్తారు. ఇందులో బీపీఎల్ కుటుంబాలకు రూ. 1కే కనెక్షన్ మంజూరు చేస్తారు. దరఖాస్తు అందిన 2–3 రోజుల్లోనే నల్లా బిగిస్తారు. ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో సోమవారం పట్టణ భగీరథ ప్రాజెక్టు, నిర్వహణ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ ఈ విషయం వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న పేదలకు, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బోర్డు గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది.. వారి ఇంటికి వెళ్లి కొత్త కనెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రూపాయికే నల్లా..
బీపీఎల్ కుటుంబాలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని ఎండీ ఆదేశించారు. దీనికి అదనంగా ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. సాధారణ వినియోగదారులు మాత్రం రోడ్డు కటింగ్ ఛార్జీలతో పాటు ఇంటి నిర్మాణ విస్తీర్ణం, అంతస్తులను బట్టి నల్లా కనెక్షన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కొత్త నల్లా ఛార్జీలను డెబిట్ , క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించే సదుపాయం కల్పించినట్లు దానకిషోర్ తెలిపారు. ప్రతిసెక్షన్ మేనేజర్ రాబోయే మూడునెలల్లో నూతన నల్లా కనెక్షన్ల జారీకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ,ప్రాజెక్టు విభాగం డైరెక్టర్లు డి.శ్రీధర్‌బాబు, ఎల్లాస్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆటోనగర్ నడిగడ్డ తండాలో ట్రయల్‌రన్..
ఆటోనగర్ నడిగడ్డ తండాలో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్ పరిసరాల్లోని నిరుపేదలు, ఇతర వినియోగదారులకు నూతన నల్లా కనెక్షన్లను ఏర్పాటు చేసి త్వరలో నీటిసరఫరా చేసేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తామని దానకిశోర్ తెలిపారు. జలమండలి సిబ్బంది కంప్యూటర్లు, స్కానర్లతో ఆయా బస్తీలకు వెళ్లి క్షేత్రస్థాయిలో వినియోగదారులు, నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. అక్కడికక్కడే వినియోగదారుని వివరాలను తనిఖీ చేసి నల్లా కనెక్షన్లు మంజూరీ చేయాలని సూచించారు. వినియోగదారులకు తక్షణ సాయం అందించేందుకు క్షేత్రస్థాయిలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ సభ్యులతో కలిసి కొత్త నల్లా కనెక్షన్ల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎండీ తెలిపారు.
ఈ నెలలో 12 రిజర్వాయర్లు ప్రారంభం..
మహానగరంలో విలీనమైన శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1900 కోట్ల హడ్కో నిధులతో చేపట్టిన 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లలో 12 రిజర్వాయర్లను ఏప్రిల్ నెలలోనే ప్రారంభిస్తామన్నారు. శివార్లలో తాగునీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేని వందలాది బస్తీలు, కాలనీల్లో నూతన నల్లాకనెక్షన్ల జారీకి ఇప్పటివరకు 1800 కి.మీ మార్గంలో తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో నూతనంగా రెండు లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశామని దానకిశోర్ తెలిపారు. కాగా జలమండలి పరిధిలో ప్రస్తుతం 9.65 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. నూతనంగా ఇచ్చే కనెక్షన్లతో వీటి సంఖ్య 11.65 లక్షలకు చేరుకోనుండటం విశేషం.