
మోదీకి ఎన్డీయే అండ
నోట్ల ఉపసంహరణ, సర్జికల్ దాడులకు మద్దతు తెలిపిన మిత్రపక్షాలు
న్యూఢిల్లీ: అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్‌స (ఎన్డీయే)లోని అన్ని పార్టీలు పెద్ద నోట్ల ఉపసంహరణ, సర్జికల్ దాడులపై ప్రధాని మోదీ వెంట నిలిచారుు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం సోమవారం జరిగింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాలపై విపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధమని మిత్ర పక్షాలు ప్రకటించారుు. నోట్ల ఉపసంహరణ విషయంలో పునరాలోచించే ప్రసక్తే లేదనీ, నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న మహాయుద్ధం సరైన ఫలితాన్ని ఇస్తుందని భేటీ అనంతరం సమాచార, ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
కష్టాన్ని ఓర్చుకుంటూనే నోట్ల రద్దుకు ప్రజలు భారీ మద్దతు తెలుపుతున్నందున పార్లమెంటు సమావేశాల్లో రక్షణాత్మక ధోరణితో వ్యవహరించకుండా ప్రతిపక్షాలకు గట్టి సమాధానమివ్వాలని మోదీ భాగస్వామ్య పక్షాలతో అన్నారు. ప్రజల్లోకి వెళ్లి నోట్ల ఉపసంహరణ వల్ల దీర్ఘకాలంలో కలిగే ప్రయోజనాలను వివరించాలని ఆయన మిత్ర పక్షాలను కోరారు. శివసేన, శిరోమణి అకాలీదల్‌లు నోట్ల ఉపసంహరణను సమర్థిస్తూనే ప్రజలు పడుతున్న కష్టాలను సమావేశంలో లేవనెత్తారుు. శివసేన తన పత్రిక ‘సామ్నా’లో నోట్ల రద్దును విమర్శించింది. నల్లధనం, నకిలీ నోట్ల నిరోధానికి మోదీ చేపట్టిన చర్యను తామంతా స్వాగితిస్తున్నామని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన మౌఖిక తీర్మానాన్ని బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆమోదించింది.