
నోట్ల రద్దు.. ప్రభుత్వం ఊహించిన దానికంటే
న్యూఢిల్లీ: నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేసిన అనంతరం బ్యాంకుల్లో డిపాజిట్లు ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు బ్యాంకుల్లో జమ అయిన రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ సుమారు 13 లక్షల కోట్లకు దగ్గరగా ఉందని సమాచారం. ఇంతకుముందు 13-14 లక్షల కోట్ల పాత కరెన్సీ బ్యాంకులకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పటికే డిపాజిట్‌లు ప్రభుత్వ అంచనాలకు దగ్గరగా చేరుకోవడం.. ఇంకా వచ్చే అవకాశం ఉండటంతో 15.5 లక్షల కోట్ల వరకు ఈ డిపాజిట్‌లు చేరుకోవచ్చని ప్రభుత్వం తన అంచనాలను సవరించుకుంది.
ఇంతకు ముందు ఆర్‌బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 18 నాటికి 5.4 లక్షల కోట్లు, నవంబర్ 27 నాటికి 8.5 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. అయితే ఇటీవల మాత్రం ఊహించని విధంగా ఈ డిపాజిట్‌లు పెరిగిపోవడం గమనార్హం. దీంతో నవంబర్ 27 నుంచి భారీ మొత్తంలో జరిగిన డిపాజిట్‌లను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇన్‌కం టాక్స్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్, ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు అనుమానిత డిపాజిట్‌లపై విచారణ జరుపుతున్నాయి.