సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో నోట్ల కట్టల వెల్లువ కొనసాగుతోంది. ఆదాయపన్ను శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడుతోంది. తాజాగా తేని జిల్లా ఆండిపట్టిలో ఈసీ, ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 1.48 కోట్ల నగదు పట్టుబడింది. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మునేట్ర కజగం(ఏఎంఎంకే) నేత నిర్వహిస్తున్న దుకాణం నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆండిపట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. వార్డు నంబర్లు, ఓటర్ల సంఖ్యలు రాసివున్న కవర్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ. 300 చొప్పున నగదు ఉంచినట్టు గుర్తించారు. అంతేకాదు ఏఎంఎంకే అభ్యర్థికి టిక్ పెట్టిన పోస్టల్ బ్యాలెట్ పేపర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకే సోదాలు మొదలు పెట్టారు. ఐటీ అధికారులను అడ్డుకునేందుకు ఏఎంఎంకే కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, డీఎంకే అభ్యర్థికి చెందిన రూ. 11.53 కోట్ల నగదు పట్టుబడటంతో వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ఉత్తర్వులిచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో ఐటీ దాడులు చేయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కూడా రేపు జరగనుంది. (చదవండి: వెల్లూరులో ఎన్నిక రద్దు)
Comments
Please login to add a commentAdd a comment