‘ఆపరేషన్ మైత్రి’ ముమ్మరం
నేపాల్‌లో భారీస్థాయిలో భారత్ సహాయక చర్యలు
న్యూఢిల్లీ: భారీ భూకంపతో కుదేలైన పొరుగు దేశం నేపాల్‌ను ఆదుకోవడానికి ‘ఆపరేషన్ మైత్రి’ పేరుతో చేపట్టిన సహాయక కార్యక్రమాలను భారత్ ముమ్మరం చేసింది. ఆదివారం రెండు డజన్లకు పైగా విమానాలు, చాపర్లను కఠ్మాండుకు పంపింది. వాటితో పాటు సుశిక్షితులైన 1,000 మంది సిబ్బందిని తరలించింది. అక్కడ చిక్కుకున్న పర్యాటకులను రోడ్డు మార్గం ద్వారా త్వరగా తరలించేందుకు అంబులెన్స్‌లు, బస్సులు ఏర్పాటు చేశారు. శనివారం నుంచి 1000 మందిని విమానాల ద్వారా తరలించారు.
ఢిల్లీలో భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. సహాయచర్యల సమన్వయానికి హోం శాఖ ఆధ్వర్యంలో మంత్రుల బృందం పర్యటించనుందన్నారు. నేపాల్ నుంచి శనివారం 546, ఆదివారం 504 మందిని భారత్‌కు తీసుకొచ్చామని తెలిపారు. ప్రమాద ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులకు ప్రాధాన్యం ఇస్తూనే.. ఇతర దేశస్తులను కూడా మన బృందాలు రక్షిస్తున్నాయన్నారు. భూకంపం తర్వాత వచ్చే చిన్న ప్రకంపనల వల్ల కఠ్మాండు ఎయిర్‌పోర్టును చాలా సేపు మూసివేయడంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగిందని చెప్పారు.
పది టన్నుల దుప్పట్లు, 50 టన్నుల నీళ్లు, 22 టన్నుల ఆహార పదార్థాలు, 2 టన్నుల మందులు కఠ్మాండుకు పంపినట్లు వెల్లడించారు. ఆర్మీ, సివిల్ డాక్టర్లను, ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్సును తరలించామన్నారు. నేపాల్‌లో వర్షాలతో పాటు.. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, భారీగా హిమపాతానికి ఆస్కారం ఉందని ఐఎండీ డీజీ ఎల్‌ఎస్ రాథోర్ తెలిపారు. భూ అంతర్భాగంలోని ప్లేట్ల సర్దుబాట్ల వల్ల మరికొన్ని వారాలు, నెలలు లేదా ఏళ్ల పాటు భూకంపానంతర ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. శనివారం ప్రధాన భూకంపం అనంతరం 46 ఆఫ్టర్‌షాక్స్ వచ్చాయని తెలిపారు. వీటిలో చాలామటుకు రిక్టర్ స్కేల్‌పై 4 నుంచి 6గా నమోదయ్యాయని, వాటిల్లో ఒకటి 6.9గా, మరోటి 6.6గా స్కేల్‌పై నమోదైందని తెలిపారు.