
ప్రీతిజింటా-నెస్ వాడియా(ఫైల్ ఫొటో)
ముంబై/న్యూఢిల్లీ: మాజీ ప్రియురాలు, వ్యాపార భాగస్వామి, బాలీవుడ్ నటి ప్రీతిజింటా ఇచ్చిన ఫిర్యాదుతో ప్రముఖ వ్యాపార వేత్త నెస్ వాడియాకు తిప్పలు మొదలయ్యాయి. ఐపిఎల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు యాజమాన్య భాగస్వాములైన వీరిద్దరూ సహజీవనం చేసినట్లు సమాచారం. దాదాపు అయిదు సంత్సరాలు కొనసాగిన వారి మధ్య సంబంధం రెండేళ్ల క్రితం దెబ్బతిన్నట్లు తెలిసింది. రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయినా ఇద్దరి మధ్యా వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి. మే 30న వాంఖేడ్ స్టేడియంలో పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని ప్రీతి జింటా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింతా ఆరోపించింది.
సినీనటి ప్రీతిజింటా ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐపీఎల్ సీఈఓ సుందర్ రామన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. వాంఖడే స్టేడియం సిబ్బందిని కూడా పోలీసులు విచారించనున్నారు. పంజాబ్ ప్లేయర్ల నుంచీ వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మెరైన్ డ్రైవ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. అతనిపై 354,504,506,509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 39 సంవత్సరాల వయసున్న ప్రీతి ఫిర్యాదుతో మహారాష్ట్ర మహిళా కమిషన్ నెస్‌వాడియాకు అల్టిమేటం జారీచేసింది. 24 గంటల్లోగా అతనిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యూ) కూడా స్పందించింది. దీనిని సుమోటోగా స్వీకరించాలని నిర్ణయించింది. ప్రీతిజింటాకు జరిగిన అవమాన ఘటనను సమగ్రంగా విచారించనున్నట్లు ఎన్సిడబ్ల్యూ చైర్పర్సన్ మమతా శర్మ చెప్పారు.