కాంగ్రెసా.. కాషాయమా! | The new Congress strategy in Gujarat points to a worrying polity | Sakshi
Sakshi News home page

కాంగ్రెసా.. కాషాయమా!

Published Thu, Nov 16 2017 2:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

The new Congress strategy in Gujarat points to a worrying polity - Sakshi

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: గుజరాత్‌ శాసనసభ తొలి విడత ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. 22 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉండగా 89 స్థానాలకు డిసెంబర్‌ 9న పోలింగ్‌ జరుగుతుంది. మళ్లీ కాషాయపక్షానికే మెజారిటీ సీట్లు వస్తాయని అంచనావేసిన సీఎస్‌డీఎస్‌–ఎబీపీ న్యూస్‌ సర్వే... బీజేపీ ఇటీవల మాసాల్లో కొంత జనాదరణ కోల్పోయిందని కూడా వెల్లడించింది.

మరోపక్క చాలాకాలంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌కు ఈసారి పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి(పాస్‌) నేత హార్దిక్‌పటేల్, దళిత నేత జిగ్నేష్‌ మేవానీ, బీసీల నేత అల్పేష్‌ ఠాకూర్‌ల మద్దతు లభించింది. దీంతో గెలుపు తమదేనన్న ఉత్సాహంతో కాంగ్రెస్‌ ప్రచారపర్వంలో ముందుకుసాగుతోంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మునుపెన్నడూ లేనట్లుగా ప్రధాని నరేంద్రమోదీపైన, పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీపై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతూ  నిత్యం వార్తల్లో కనిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ అనేక హిందూ ఆలయాలను క్రమం తప్పకుండా దర్శించడం, పూజలు చేయడం కొత్త పరిణామం. హార్దిక్‌ మనుషులకు 20–25 టికెట్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్‌ నిర్ణయించిందని వార్తలొచ్చాయి.

మధ్య గుజరాతే గెలిపిస్తుందా?
గుజరాత్‌ను ప్రాంతాలవారీగా చూస్తే కచ్, ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగ్గా ఉంది. మొత్తం అసెంబ్లీ సీట్లలో సగం ఇక్కడే ఉన్నాయి. అయితే బీజేపీకి కంచుకోటలుగా భావించే మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్‌ ప్రాంతాల్లో కాంగ్రెస్‌తో పోల్చితే బీజేపీ చాలా ముందుందనీ, జనం పాలకపక్షాన్నే సమర్థిస్తున్నారని ఇటీవల జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. 2014లో కేంద్రంలో, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి గుజరాత్‌కు చెందిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యూహాలే కారణమని మీడియా ప్రశంసల వర్షం కురిపించింది.

కానీ, ఆయన కొడుకు జయ్‌షా వ్యాపారం ఊహకందనిరీతిలో వృద్ధిచెందడంతో మొదటిసారి అమిత్‌ షా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీని ప్రభావం ఎన్నికల్లో ఉండొచ్చు. జనతాదళ్‌–యూ(జేడీయూ)అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సోమవారం ’’గుజరాత్‌లో బీజేపీకి ఎలాంటి ముప్పు ఉండదు’’ అని వ్యాఖ్యానించారు. నితీశ్‌ జోస్యం ఎలా ఉన్నా బీజేపీ ఈ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకుని ముందుకుసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్‌ కూడా, గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement