patidar andolan samiti
-
హార్దిక్ పటేల్‌కు హైకోర్టు షాక్
అహ్మదాబాద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమైన పటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. 2015లో ఓ అల్లర్ల కేసులో దిగువ కోర్టు దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని హార్దిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హార్దిక్ పటేల్‌పై 17 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని గుజరాత్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వీటిలో రెండు దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయని వెల్లడించింది. హార్దిక్‌కు నేరచరిత్ర ఉందని పేర్కొంది. దీంతో హార్దిక్ పటేల్‌పై నమోదైన కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పటీదార్ రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా 2015, జూలైలో ఆందోళనకారులు బీజేపీ ఎమ్మెల్యే హృషీకేశ్ పటేల్ కార్యాలయంపై దాడిచేశారు. ఈ కేసును విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్‌ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో హార్దిక్ గతేడాది గుజరాత్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన శిక్షపై స్టే విధించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువకాలం జైలుశిక్ష పడ్డవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తనను దోషిగా తేలుస్తూ విస్నగర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్లో నామినేషన్ల దాఖలుకు గడువు ఏప్రిల్ -
వీలునామా సిద్ధం చేసుకున్న హార్దిక్
అహ్మదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్లతోపాటు రైతు రుణమాఫీ చేయాలంటూ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ చేస్తున్న అమరణ నిరాహార దీక్షకు ఆదివారంతో 9రోజులు పూర్తయ్యాయి. అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలోనే హార్దిక్ తన ఆస్తులను పంచుతూ వీలునామా రాయడం సంచలనం సృష్టిస్తోంది. హార్దిక్ ఖాతాలో రూ.50 వేలున్నాయి. ఇందులో తల్లిదండ్రులకు 20వేలు, పంజ్రపోల్ గ్రామంలో ఆవులకు షెడ్ కోసం రూ.30వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. ‘తన జీవితగాథపై వస్తున్న పుస్తకం హూ టుక్ మై జాబ్‌పై వచ్చే రాయల్టీ, ఇన్సూరెన్స్ డబ్బులు, తన కారు అమ్మగా వచ్చిన మొత్తాన్ని తల్లిదండ్రులు, చెల్లెలితోపాటు మూడేళ్ల క్రితం పటీదార్ ఉద్యమంలో చనిపోయిన 14 మందికి పటేళ్లకు సమానంగా పంచాలని హార్దిక్ పేర్కొన్నారు’ అని పటీదార్ సంఘం అధికార ప్రతినిధి మనోజ్ పనారా వెల్లడించారు. ఒకవేళ ఈ దీక్షలో తను చనిపోతే.. కళ్లను దానం చేయాలని సూచించారు. వీలునామాలో పేర్కొన్న వివరాల ప్రకారం హార్దిక్ ఆస్తిలో 15%తల్లిదండ్రులకు, 15% చెల్లెలికి మిగిలిన 70% 14 మంది పటీదార్లకు చెందుతుంది. -
హార్దిక్‌కు రెండేళ్ల జైలు
మెహసానా: పటీదార్ల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్‌కు గుజరాత్‌లోని ఓ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2015 జూలైలో విస్నగర్లో జరిగిన అల్లర్లు, ఆస్తి నష్టం కేసులో హార్దిక్‌తో పాటు లాల్జీ పటేల్, ఏకే పటేల్‌కు శిక్ష పడింది. అయితే వెంటనే అదేకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. అల్లర్లు సృష్టించడం, ఆస్తి నష్టం, చట్ట వ్యతిరేకంగా సమావేశం కావడం వంటి కేసుల్లో వారు ముగ్గురూ దోషులుగా తేలినట్లు విస్నగర్ సెషన్స్ కోర్టు జడ్జి వీపీ అగర్వాల్ తీర్పులో పేర్కొన్నారు. వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 14 మందిని సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు విడిచిపెట్టింది. పటీదార్ రిజర్వేషన్ల కోసం విస్నగర్లో జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారిందని, దీనివల్ల ఆస్తి నష్టం, మీడియాపై దాడులు జరిగాయని మెహసానా జిల్లాలో 2015 జూలై 23న ఎఫ్ఐఆర్ నమోదైంది. సత్యం, రైతులు, యువత, పేదవారి కోసం తాను చేస్తున్న ఉద్యమాన్ని బెదిరింపులతో బీజేపీ ‘హిట్లర్ షాహీ’ ఆపలేరని హార్దిక్ పటేల్ మీడియాతో పేర్కొన్నారు. -
రిజర్వేషన్ల కోసం ఆఖరి పోరాటం: హార్దిక్
అహ్మదాబాద్: పటేల్ వర్గీయులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆగస్టు 25 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్లు పటీదార్ ఆందోళన్ సమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్ ప్రకటించారు. తన వర్గీయులకు రిజర్వేషన్లు సాధించడమే తన లక్ష్యమని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కోటా సాధనలో తన ప్రాణాలు పోయినా లెక్కచేయనన్నారు. ‘ఈ పోరాటంలో మీ అందరి మద్దతు కోరుతున్నా. పటీదార్ క్రాంతి దివస్ అయిన ఆగస్టు 25 నుంచి నిరాహార దీక్షకు దిగబోతున్నా. రిజర్వేషన్లు సాధించే వరకు ఆహారం, నీరు ముట్టుకోను’ అన్నారు. -
ఇక మరాఠాల వంతు..!
సాక్షి, ముంబై : గుజరాత్లో పటేదార్ల రిజర్వేషన్ ఉద్యమంతో స్ఫూర్తిపొందిన మరాఠాలు.. మహారాష్ట్రలో మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. మరాఠా యోధుడు శివాజీ జన్మదినమైన పిబ్రవరి 19 నుంచి రిజర్వేషన్ల కోసం ఉద్యమించేందుకు మరాఠాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గుజరాత్లో పటేదార్లు ఉద్యమం, ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019లో మహారాష్ట్ర శాసనసభ, లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. పటేదార్ల తరహా ఉద్యమాన్ని నిర్మించేందుకు మరాఠాలు సిద్ధమవుతున్నారు. ఉద్యమ నిర్మాణం గురించి మరాఠా నేతలు.. మంగళవారం సమావేశమయ్యారు. మరోదశ ఉద్యమాన్ని శివాజీ చక్రవర్తి జన్మదినం నాడు మొదలు పెట్టి.. 2019లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీలకు 2019లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆలోపే లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యమ నేతలు తెలిపారు. మరాఠాలు కోరికేంటి? విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ.. మరాఠాలు సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నారు. ఉద్యమానికి కారణాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో.. వారికే విద్య, ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తున్నాయి. రిజర్వేషన్ల ఆసరాతో ఆయా వర్గాలు వేగంగా పురోగమిస్తున్నాయి. అదే రీతిలో మరాఠాలు తిరోగమిస్తున్నారు. బీజేపీ 2014 ఎన్నికల తరువాత బ్రాహ్మణ వర్గానికి చెందిన దేవేంద్ర పఢ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంతో.. మరాఠాలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఫలితాలను మార్చే మరాఠాలు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను, పార్టీల తలరాతలను మరాఠాలు మార్చగలరు. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 75 స్థానాల్లో మరాఠాలు ఫలితాలను తారుమారు చేయగలరు. మొత్తం మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 33 శాతం వరకూ ఉన్నారు. చెక్కెర కర్మాగారాలు, విద్యాసంస్థలు, కో-ఆపరేటిక్ సెక్టార్లలో మరాఠాలది తిరుగులేని ఆధిపత్యం. -
‘పటేళ్లకు రిజర్వేషన్లపై 24 గంటల్లో తేల్చండి’
గాంధీనగర్: గుజరాత్లో అధికారంలోకి వస్తే పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తారో లేదో 24 గంటల్లోగా తేల్చి చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి పాస్ (పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి) గడువు విధించింది. పాస్ నేతలతో ఢిల్లీలో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ సిన్హ్ తొలుత స్వల్పకాలంపాటు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయిన తర్వాత మళ్లీ మాట్లాడతామని చెప్పి ఆయన వెళ్లిపోయారు. పాస్ నేత దినేశ్ బమానియా మాట్లాడుతూ ‘సమావేశం అయిపోయినా ఆయన మమ్మల్ని కలవలేదు. మేం ఫోన్ చేస్తున్నా స్పందించలేదు. ఇది మాకు అవమానం’ అని అన్నారు. దీంతో రిజర్వేషన్ల అంశంపై 24 గంటల్లోగా తేల్చి చెప్పాలని దినేశ్ కాంగ్రెస్ వారికి కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. మరోవైపు పాస్ నేత హర్దిక్ పటేల్ మాజీ సన్నిహితులు ఇద్దరు తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. గతేడాది ఆగస్టులో పాస్ నుంచి బహిష్కరణకు గురైన కేతన్ పటేల్, అమరేశ్ పటేల్‌లు శనివారం బీజేపీలో చేరారు -
కాంగ్రెసా.. కాషాయమా!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: గుజరాత్ శాసనసభ తొలి విడత ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. 22 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉండగా 89 స్థానాలకు డిసెంబర్ 9న పోలింగ్ జరుగుతుంది. మళ్లీ కాషాయపక్షానికే మెజారిటీ సీట్లు వస్తాయని అంచనావేసిన సీఎస్డీఎస్–ఎబీపీ న్యూస్ సర్వే... బీజేపీ ఇటీవల మాసాల్లో కొంత జనాదరణ కోల్పోయిందని కూడా వెల్లడించింది. మరోపక్క చాలాకాలంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌కు ఈసారి పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) నేత హార్దిక్‌పటేల్, దళిత నేత జిగ్నేష్ మేవానీ, బీసీల నేత అల్పేష్ ఠాకూర్ల మద్దతు లభించింది. దీంతో గెలుపు తమదేనన్న ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రచారపర్వంలో ముందుకుసాగుతోంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మునుపెన్నడూ లేనట్లుగా ప్రధాని నరేంద్రమోదీపైన, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీపై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతూ నిత్యం వార్తల్లో కనిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ అనేక హిందూ ఆలయాలను క్రమం తప్పకుండా దర్శించడం, పూజలు చేయడం కొత్త పరిణామం. హార్దిక్ మనుషులకు 20–25 టికెట్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించిందని వార్తలొచ్చాయి. మధ్య గుజరాతే గెలిపిస్తుందా? గుజరాత్‌ను ప్రాంతాలవారీగా చూస్తే కచ్, ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉంది. మొత్తం అసెంబ్లీ సీట్లలో సగం ఇక్కడే ఉన్నాయి. అయితే బీజేపీకి కంచుకోటలుగా భావించే మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో కాంగ్రెస్‌తో పోల్చితే బీజేపీ చాలా ముందుందనీ, జనం పాలకపక్షాన్నే సమర్థిస్తున్నారని ఇటీవల జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. 2014లో కేంద్రంలో, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి గుజరాత్‌కు చెందిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలే కారణమని మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. కానీ, ఆయన కొడుకు జయ్షా వ్యాపారం ఊహకందనిరీతిలో వృద్ధిచెందడంతో మొదటిసారి అమిత్ షా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీని ప్రభావం ఎన్నికల్లో ఉండొచ్చు. జనతాదళ్–యూ(జేడీయూ)అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సోమవారం ’’గుజరాత్లో బీజేపీకి ఎలాంటి ముప్పు ఉండదు’’ అని వ్యాఖ్యానించారు. నితీశ్ జోస్యం ఎలా ఉన్నా బీజేపీ ఈ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకుని ముందుకుసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ కూడా, గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
నవంబర్ 3లోపు మీ వైఖరి తెలపాలి
అహ్మదాబాద్: పటేళ్ల రిజర్వేషన్లపై నవంబర్ 3లోగా తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీకి పటేళ్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ గడువిచ్చారు. డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తేనే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుపై ఆలోచిస్తామన్నారు. లేదంటే నవంబర్ 3న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చేపట్టే సూరత్ పర్యటనను అడ్డుకుంటామన్నారు. కాగా, ఎన్నికల్లో పటీదార్ వర్గీయులకు అధికంగా టికెట్లు ఇవ్వడం, పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించడం వంటి డిమాండ్ల జాబితాను గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ అశోక్ గెహ్లాట్‌కు హార్దిక్ పటేల్ ఇటీవల అందజేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో డిసెంబర్ 9, 14న జరుగనున్నాయి. -
హార్దిక్‌పై అరెస్ట్ వారెంట్ రద్దు
మెహ్సనా: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో పటేళ్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌పై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. గురువారం ఈ మేరకు విస్నగర్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2015లో పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ఉద్యమంలో భాగంగా తన ఆఫీస్‌పై హార్దిక్ అనుచరులు దాడి చేశారని బీజేపీ ఎమ్మెల్యే రిషికేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కోర్టు హార్దిక్‌తో పాటు మరో ఆరుగురికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. దీంతో హార్దిక్ గురువారం కోర్టులో హాజరయ్యారు. కేసును విచారించిన కోర్టు హార్దిక్, సర్దార్ పటేల్ గ్రూప్ కన్వీనర్ లాలాజీసహా పలువురిపై అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేసింది. -
5 వేల కార్ల కాన్వాయ్‌తో వస్తున్నాడు!
-
5 వేల కార్ల కాన్వాయ్‌తో వస్తున్నాడు!
దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత పాటీదార్ అనామత్ ఆందోళన సమితి నాయకుడు హార్దిక్ పటేల్ మళ్లీ గుజరాత్లో కాలు మోపుతున్నారు. పటేళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమించిన హార్దిక్ పటేల్ మీద ప్రభుత్వం రాజద్రోహ నేరం మోపిన సంగతి తెలిసిందే. దాంతో ఆరు నెలల పాటు గుజరాత్లో అడుగు పెట్టకూడదని కోర్టు అతడిని ఆదేశించింది. ఆ డెడ్‌లైన్ మంగళవారంతో ముగిసింది. రాజస్థాన్‌లోని రతన్‌పూర్ వద్ద సరిహద్దు దాటి గుజరాత్‌లోకి అడుగుపెట్టగానే 5వేల కార్లతో కూడిన భారీ కాన్వాయ్ ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. అక్కడినుంచి ఉత్తర గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్ ప్రాంతానికి హార్దిక్ పటేల్ బయల్దేరతాడు. లక్షమంది కార్యకర్తలతో తాము రతన్ పూర్ నుంచి హిమ్మత్ నగర్ ర్యాలీగా వెళ్తున్నట్లు పాటీదార్ అనామత్ ఆందోళన సమితి నాయకుడు వరుణ్ పటేల్ చెప్పారు. హిమ్మత్‌నగర్ చేరుకున్న తర్వాత తమ ఆందోళన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మధ్యాహ్నం తర్వాత హార్దిక్ పటేల్ గాంధీనగర్ చేరుకుంటాడు. అక్కడ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్‌ను కలవాల్సి ఉంది. ఈ సంవత్సరం చివర్లో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పటేల్ తిరిగి రావడంతో అతడి కదలికలను అన్ని పార్టీలూ జాగ్రత్తగా గమనిస్తున్నాయి. హార్దిక్ మద్దతు తమకు కావాలని ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. పటేల్ దేశభక్తుడని కీర్తించడం ద్వారా ఇప్పటికే కేజ్రీవాల్ ఓ అడుగు ముందుకేశారు. బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం పటేళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందంటూ భారీగా ఉద్యమం మొదలుపెట్టిన హార్దిక్ పటేల్.. 45 రోజుల పాటు దాన్ని కొనసాగించారు. తర్వాత ఆయన చేపట్టిన ర్యాలీ హింసాత్మక ఘటనలకు దారి తీయడం, అందులో 12 మంది మరణించడంతో 2015 ఆగస్టులో అరెస్టు చేశారు. అనంతరం అతడి మీద రాజద్రోహం కేసు పెట్టి, సూరత్ జైల్లో తొమ్మిది నెలల పాటు ఉంచారు. తర్వాత బెయిల్ వచ్చినా, గుజరాత్లో అడుగుపెట్టకూడదని షరతు విధించారు.