దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత పాటీదార్ అనామత్ ఆందోళన సమితి నాయకుడు హార్దిక్ పటేల్ మళ్లీ గుజరాత్‌లో కాలు మోపుతున్నారు.

దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత పాటీదార్ అనామత్ ఆందోళన సమితి నాయకుడు హార్దిక్ పటేల్ మళ్లీ గుజరాత్‌లో కాలు మోపుతున్నారు. పటేళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమించిన హార్దిక్ పటేల్ మీద ప్రభుత్వం రాజద్రోహ నేరం మోపిన సంగతి తెలిసిందే. దాంతో ఆరు నెలల పాటు గుజరాత్‌లో అడుగు పెట్టకూడదని కోర్టు అతడిని ఆదేశించింది. ఆ డెడ్‌లైన్ మంగళవారంతో ముగిసింది.
రాజస్థాన్‌లోని రతన్‌పూర్ వద్ద సరిహద్దు దాటి గుజరాత్‌లోకి అడుగుపెట్టగానే 5వేల కార్లతో కూడిన భారీ కాన్వాయ్ ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. అక్కడినుంచి ఉత్తర గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్ ప్రాంతానికి హార్దిక్ పటేల్ బయల్దేరతాడు. లక్షమంది కార్యకర్తలతో తాము రతన్ పూర్ నుంచి హిమ్మత్ నగర్ ర్యాలీగా వెళ్తున్నట్లు పాటీదార్ అనామత్ ఆందోళన సమితి నాయకుడు వరుణ్ పటేల్ చెప్పారు. హిమ్మత్‌నగర్ చేరుకున్న తర్వాత తమ ఆందోళన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
మధ్యాహ్నం తర్వాత హార్దిక్ పటేల్ గాంధీనగర్ చేరుకుంటాడు. అక్కడ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్‌ను కలవాల్సి ఉంది. ఈ సంవత్సరం చివర్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పటేల్ తిరిగి రావడంతో అతడి కదలికలను అన్ని పార్టీలూ జాగ్రత్తగా గమనిస్తున్నాయి. హార్దిక్ మద్దతు తమకు కావాలని ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. పటేల్ దేశభక్తుడని కీర్తించడం ద్వారా ఇప్పటికే కేజ్రీవాల్ ఓ అడుగు ముందుకేశారు.
బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం పటేళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందంటూ భారీగా ఉద్యమం మొదలుపెట్టిన హార్దిక్ పటేల్.. 45 రోజుల పాటు దాన్ని కొనసాగించారు. తర్వాత ఆయన చేపట్టిన ర్యాలీ హింసాత్మక ఘటనలకు దారి తీయడం, అందులో 12 మంది మరణించడంతో 2015 ఆగస్టులో అరెస్టు చేశారు. అనంతరం అతడి మీద రాజద్రోహం కేసు పెట్టి, సూరత్ జైల్లో తొమ్మిది నెలల పాటు ఉంచారు. తర్వాత బెయిల్ వచ్చినా, గుజరాత్‌లో అడుగుపెట్టకూడదని షరతు విధించారు.